Wednesday, January 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పోరాటమే మన మార్గం

పోరాటమే మన మార్గం

- Advertisement -

హైదరాబాద్‌లో పుట్టిన కె.ఎన్‌.ఆశాలత తండ్రి చేయి పట్టుకొని చిన్నతనంలోనే ఢిల్లీ వెళ్లారు. పోస్టల్‌ డిమార్ట్‌మెంట్లో పని చేసే తండ్రి ఉద్యమ అవసరాల రీత్యా అక్కడే స్థిరపడ్డారు. ఉద్యమంతో మమేకమైన రాజన్‌తో బిడ్డ పెండ్లి చేశారు. తండ్రి పెంపకంలో అభ్యుదయ భావాలను అలవర్చుకున్న ఆమె పెండ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో మహిళా ఉద్యమంలోకి అడుగుపెట్టారు. అలా సుమారు 30 ఏండ్ల పాటు ఢిల్లీ నగర మహిళా ఉద్యమంతో ఆమె జీవితం పెనవేసుకొని ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. తన సొంత గడ్డ హైదరాబాద్‌ నగరంలో జనవరి 25 నుండి 28 వరకు ఐద్వా అఖిల భారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో తన ఉద్యమ అనుభవాలను మానవితో ఇలా పంచుకున్నారు.

1978 నుండి నేను ఢిల్లీ మహిళా ఉద్యమంలో పని చేయడం మొదలుపెట్టాను. అంతకు ముందు ఇంట్లోనే ఉండేదాన్ని. పార్టీ ఆఫీసు పక్కనే మా ఇల్లు ఉండేది. నా భర్త రాజన్‌ ఆఫీసు కార్యదర్శిగా పని చేసేవారు. ఆయనే నాయకురాలు బృందాతో ‘మా ఆషాను కూడా కార్యక్రమాలకు తీసుకెళ్లండి’ అన్నారు. అప్పట్లో ఢిల్లీ నగరంలో మూడు నాలుగు బట్టల మిల్లులు ఉండేవి. బృందా అప్పుడు సీఐటీయూ నాయకురాలు. ఆ కార్మికుల సమస్యలపై రెండు నెలల పాటు సమ్మె చేశారు. ఆ పోరాటంలో నేను కూడా పాల్గొన్నారు. అందులో పని చేసే మహిళా కార్మికులతో మంచి పరిచయాలు వచ్చాయి.

మరుగుదొడ్ల కోసం…
అప్పట్లో మహిళా ఉద్యమం ఐద్వా పేరుతో ఉండేది కాదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కమిటీలు వేసుకొని పనిచేసేవాళ్లు. అలా ఢిల్లీ రాష్ట్రంలో బృందా కన్వీనర్‌గా ఓ కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. అప్పట్లో ఢిల్లీలో సావన్‌పార్క్‌ అనే ప్రాంతం ఉండేది. నిరుపేద కుటుంబాలు అక్కడి రైల్వే ట్రాక్‌ పక్కన గుడిసెలు వేసుకొని జీవించేవారు. ఎలాంటి సౌకర్యాలూ ఉండేవి కావు. ఆ ప్రాంత ప్రజల సమస్యలపై పని చేయడానికి బృందా నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మరుగుదొడ్లు లేక మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైల్వే ట్రాక్‌ దగ్గరకి వెళ్లే వారు. అలా వెళ్లిన ఇద్దరు ముగ్గురిపై లైంగిక దాడి జరిగింది. దీనిపై మేము మహిళా సంఘంగా పెద్ద ఉద్యమం చేశాము. అధికారులు స్పందించి మరుగుదొడ్లు నిర్మించారు. ఇది నన్ను బాగా ప్రభావితం చేసిన సంఘటన. అప్పటి నుండి మహిళా సంఘంలో పని చేయాలనీ, మహిళల సమస్యల కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను.

అధిక ధరలకు వ్యతిరేకంగా
వరకట్న సమస్యలపై ఢిల్లీ కమిటి అప్పట్లో బాగా పని చేసేది. కోడలిని కాల్చి చంపిన కుటుంబానికి శిక్ష పడేవరకు పోరాడాము. అప్పటి నుండి ఏ సమస్య వచ్చినా మహిళలు మా దగ్గరకే వచ్చేవారు. అప్పట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయేవి. ఈ సమస్యపై ఎవ్వరూ స్పందించేవారు కాదు. మేము మాత్రం అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. ముందు రాష్ట్రం మొత్తం నెల రోజుల పాటు క్యాంపెయిన్‌ చేశాం. ధరల పెరుగుదల మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అవగాహన కల్పించి నిరసన కార్యక్రమం చేపట్టాము. వెయ్యి మంది మహిళలు వచ్చారు. మేము చేసిన గ్రౌండ్‌ వర్క్‌ దీనికి కారణం.

సతీసహగమనంపై…
అప్పటి వరకు ఎక్కడికక్కడ రాష్ట్రాల పేర్లతో ఉన్న మహిళా సంఘాన్ని అఖిల భారత స్థాయిలో ఒకే పేరుతో నడిపించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 1981లో ఏర్పాటు చేశారు. అఖిల భారత కమిటీ కూడా వేశారు. అప్పుడు ఢిల్లీలో కూడా పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ ఏర్పడింది. బృందా ప్రధాన కార్యదర్శిగా, అశోక్‌లత జైన్‌ అధ్యక్షరాలిగా ఉన్నారు. ఆ కమిటీలో నేను సహాయకార్యదర్శిగా ఎన్నికయ్యాను. అప్పటికి నేను నార్త్‌ ఢిల్లీ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నాను. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడ సమస్య ఉన్నా వెళ్లేవాళ్లం. రాజస్థాన్‌లో ఓ మహిళను ఆమె భర్త చనిపోతే సతీసహగమనం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో మేమే 20 మహిళా సంఘాలను కలుపుకొని దీనిపై పెద్ద ఉద్యమం చేశాం.

ఐక్య ఉద్యమాలతో…
ఢిల్లీలో మహిళా సంఘాల ఐక్య ఉద్యమాలు బాగా జరిగేవి. బృందా కరత్‌ దీనికి ప్రధాన కారణం. ఆమెను అందరూ ఎంతో అభిమానించేవారు. ఎవరినైనా ఒప్పించగల శక్తిసామర్థ్యాలు ఆమెలో ఉండేవి. మహిళల సమస్యల పరిష్కారం కోసం మహిళా సంఘాలన్నీ ఐక్యమై పోరాడితే త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఐక్య పోరాటాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అలా బృందా చొరవతో ముఖ్యమైన ఏడు మహిళా సంఘాలతో ఓ ఐక్య సంఘటన ఏర్పడింది. దాన్నే సెవన్‌ సెస్టర్స్‌ అని పిలిచేవారు. దీని ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాం. నేను ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత ఐక్యకార్యచరణ సమావేశాలకు అప్పుడప్పుడు బృందా నన్ను పంపించేవాళ్లు. అలా నాకూ వాళ్లతో మంచి పరిచయాలు వచ్చాయి.

మసీద్‌ బి హౌ, మందిర్‌ బి హౌ
ఆహార భద్రతపై పెద్ద ఎత్తున పని చేశాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తే సెవన్‌ సిస్టర్‌తో పాటు మొత్తం 20 సంఘాలు కలిసి పెద్ద కార్యక్రమం చేసేవాళ్లం. పార్లమెంటు గేటు వద్ద అనేక పోరాటాలు చేసేవాళ్లం. 1992లో మతోన్మాదులు దాడులు బాగా పెరిగిపోయాయి. మసీదులపై దాడులు చేస్తుంటే ‘మసీద్‌ బి హౌ, మందిర్‌ బి హౌ’ అంటూ ఐద్వాగా ప్రచారం చేసేవాళ్లం. రాష్ట్ర కార్యదర్శిగా 1995 నుండి పద్నాలుగేండ్లు పని చేశాను. అప్పట్లో ఓ బీజేపీ నాయకుడి హాస్పిటల్లో బ్రూణహత్యలు బాగా జరుగుతుండేవి. పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని చెప్పేవాళ్లు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ డాక్టర్‌ని అరెస్టు చేయించి, హాస్పిటల్‌ను సీజ్‌ కూడా చేయించాము.

పోలీస్‌ స్టేషన్‌ ముందే ధర్నా…
మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఐద్వా ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తుంది. దీనిపై కంటిన్యూగా పార్లమెంటు గేటు ముందు ఎన్నో ఉద్యమాలు చేశాము. అలాగే నోయిడాలో ఓ డాక్టర్‌ పిల్లల్ని చంపి శరీర భాగాలు తీసుకొని శవాలను నీళ్లలో పడేసేవాడు. అలా ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీశాడు. అది బయటకు వచ్చినప్పుడు పెద్ద ఉద్యమం చేశాము. అప్పట్లో దొంగతనంగా కరెంటు మీటర్లు ఎవరైనా వాడుతున్నారేమో చూడటానికి పోలీసులు చెప్పాపెట్టకుండా ఇళ్లల్లోకి దూరే వాళ్లు. లోపల మహిళలు ఏ పరిస్థితుల్లో ఉంటారో అనే ఇంకిత జ్ఞానం ఉండేది కాదు. ఆ విషయం తెలిసిన తర్వాత మేము పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా చేశాము. మాపై కోపంతో పోలీస్‌ అధికారి తాగొచ్చి నన్ను విపరీతంగా కొట్టాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని అతన్ని సస్పెండ్‌ చేయించారు.

పన్నెండు కుట్లు పడ్డాయి
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూపోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయి. చాలా మందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. వారిలో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఢిల్లీ వస్తే ఆయన్ని ఘెరావ్‌ చేశాం. దాంతో వాటర్‌ ఫోర్స్‌తో మమ్మల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. ఆ నీటి ధాటికి నేను అంత దూరం ఎగిరిపడ్డాను. నాలుగు గంటలు స్పృహ లేకుండా పడిపోయాను. నా చెయ్యి ఇరిగిపోయింది, తలకు పన్నెండు కుట్లు పడ్డాయి. ఇలా ఐద్వాగా మహిళా సమస్యలతో పాటు సామాజిక సమస్యలపై కూడా స్పందించి ఉద్యమించేవాళ్లం. మహిళలు కూడా బాగా పాల్గొనేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.

పక్కదోవ పట్టిస్తున్నారు
మన పాలకులు మహిళలను పక్కదోవ పట్టిస్తున్నారు. నేటి బీజేపీ పాలనలో దేశ వ్యాప్తంగా మతోన్మాదం బాగా పెరిగిపోయింది. ధరలు పెరిగిపోతున్నాయి, ఉపాధి లేదు. ఇవేవీ పట్టించుకోకుండా భజనలు చేయండి, కీర్తనలు పాడండి అంటూ మహిళలను అటువైపుకు నెట్టేస్తున్నారు. గుడులకు వెళ్లి సేవ చేయండి అంటూ బస్సులు పెట్టి మరీ పంపిస్తున్నారు. ఇలా మహిళల్లో పోరాడే శక్తి లేకుండా చేస్తున్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలలోనే కులదురహంకార హత్యలు జరిగేవి. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పోరాటాలతోనే ఎన్నో హక్కులు సాధించుకున్నాం. వాటిని నిలబెట్టుకోవల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. సమస్యలను అర్థం చేయించి మహిళలందరినీ ఏకం చేసి పోరాటాల్లోకి వచ్చేలా చేయడమే ఐద్వా కర్తవ్యం.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -