– రెండు వేలమందికి పైగా మృతి
– ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం
– ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల చీఫ్
టెహరాన్ : దేశంలో మరో నాలుగు రోజుల పాటు ఇంటర్‌నెట్‌పై నిషేధాన్ని విధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే విదేశాలకు తమ మొబైల్స్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అనుమతించింది. ఉగ్రవాద చర్యల కారణంగానే ఈ చర్యలు తీసుకున్నామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి తెలిపారు. కరెన్సీ తీవ్రంగా పతనమై ఆర్థిక ఇబ్బందులు తీవ్ర సంక్షోభంగా మారిన నేపథ్యంలో తొలుత ఆందోళనలుగా ప్రారంభమైన నిరసనలు రాన్రాను ప్రభుత్వ మార్పు కోసం నినదించే పోరాటంగా మారుతున్నాయి. ఆందోళనకారులతో చేతులు కలపాల్సిందిగా ఇరాన్ భద్రతా బలగాలకు ఇరాన్ మాజీ మహారాణి మంగళవారం విజ్ఞప్తి చేసింది.ఈ పరిస్థితుల్లో ఆందోళనలకు దిగేవారిపై తీసుకుంటున్న కఠిన చర్యలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు దేశాలు ఇప్పటికే ఇరాన్ రాయబారులకు నోటీసులు జారీ చేశాయి. ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా వుందని మంత్రి తెలిపారు. దేశంలో ప్రస్తుతం చెలరేగుతున్న ఈ నిరసనలకు విదేశీ శక్తుల నుండి వచ్చిన ఆదేశాలే కారణమని అందుకే తాము చర్యలు తీసుకోవాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. కాగా ఇప్పటివరకు ఇరాన్‌లో చోటు చేసుకున్న ఈ నిరసనల్లో 2వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రవాద చర్యలే ఈ మరణాలకు కారణమని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టుర్క్‌్ ఇరాన్‌లో పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆందోళన కారులపై హింసాకాండను ఆపాలని కోరారు.
పలు దేశాల నిరసనలు
ఇరాన్ అణచివేత చర్యల ఫలితంగా ఐర్లాండ్, ఫిన్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్ సహా పలు దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇరాన్ రాయబారిని ఫిన్లాండ్ వెనక్కి పిలిపించనుండగా, కొత్త ఇరాన్ రాయబారి బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని ఐర్లాండ్ వాయిదా వేసింది. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి డేవిడ్ విన్ ఇరాన్ రాయబారిని పిలిపించి తమ నిరసన తెలియచేశారు. మరోవైపు స్పెయిన్ కూడా అదే పనిచేసింది. అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగుతున్న ఉద్రిక్తతల వల్ల ఈ ప్రాంతానికి ముప్పు నెలకొంటుందని కతార్ హెచ్చరించింది.
రెచ్చగొడుతున్న ట్రంప్
ఇరాన్ ప్రజలకు బాసటగా వున్నామని, నిరసనలు కొనసాగిస్తూనే వుండమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరానియన్లకు మంగళవారం పిలుపిచ్చారు. వారికి కావాల్సిన సాయం త్వరలో అందుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ మోసపూరిత చర్యలు తక్షణమే ఆపాలంటూ అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్‌లో మరో 4 రోజులు ఇంటర్‌నెట్ కట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



