పొంచి ఉన్న ప్రమాదం
నవతెలంగాణ – పరకాల
పట్టణంలోని ప్రధాన రహదారిపై గత 13 రోజులుగా ఒక లారీ గేర్ బాక్స్ సమస్య కారణంగా నిలిచిపోయింది. నిత్యం వాహనాలతో ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో, రోడ్డుకు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ భారీ వాహనం సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆగి ఉన్న ఈ లారీ కారణంగా ఏ ప్రమాదం ముంచుకు రానున్నదోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్టు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డుపై ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు, నిలిచిపోయిన వాహనాన్ని అక్కడి నుండి తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి, వెంటనే ఆ లారీని అక్కడి నుండి తరలించి రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు



