Sunday, May 3, 2026
E-PAPER
Homeఖమ్మంవెనుకబడిన వర్గాల విద్యార్థులదే విద్యలో ముందడుగు

వెనుకబడిన వర్గాల విద్యార్థులదే విద్యలో ముందడుగు

- Advertisement -

– సామాజికంగా వెనుకబడినా.. 
– విద్యలో వారే అగ్రగాములు
– బీసీ, మైనారిటీ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
అశ్వారావుపేటలో పాఠశాలలు.. 
– ఇంటర్‌కు వేరే ప్రాంతాలకు వలస
– వసతుల లేమితో విద్యార్థుల ఇబ్బందులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

సామాజికంగా వెనుకబడిన, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యారంగంలో మాత్రం తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అశ్వారావుపేటలోని బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచారు. పరిమిత వసతులు, ఇబ్బందికర పరిస్థితులు మధ్య చదువుకుంటూనే ఈ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం విశేషం. అశ్వారావుపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాస్ గురుకుల విద్యాసంస్థల బాలికల, బాలుర పాఠశాలలు అలాగే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల బాలికల పాఠశాల పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.

ఎంజేపీటీబీసీ బాలికల పాఠశాలలో పరీక్షలకు హాజరైన 67 మంది విద్యార్థినులు అందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ఎంజేపీటీబీసీ బాలుర పాఠశాలలో 54 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులై శతశాతం ఫలితాన్ని సాధించారు. టీఎంఆర్ఐఈఎస్ బాలికల పాఠశాలలో 33 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు.

మార్కుల పరంగా కూడా ఈ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. టీఎంఆర్ఐఈఎస్ విద్యార్థిని ఎస్‌కే బహెరా 569 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, అదే పాఠశాలకు చెందిన ఎస్‌కే ఎల్ బాబ్సమ్ 568 మార్కులు సాధించింది. ఎంజేపీటీబీసీ బాలికల పాఠశాలకు చెందిన పి.ఉదయశ్రీ 566 మార్కులు, బాలుర పాఠశాలకు చెందిన ఎం.ఎం సాయి కుమార్ 561 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ లు నిరోష, రేణుక, సంగీత లు అభినందించి, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతుల సమస్యలు మాత్రం తీవ్రమైనవే. ఎంజేపీటీబీసీ పాఠశాలలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా, మైనారిటీ బాలికల పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని పరిమిత గదుల్లో నడుస్తోంది. సరిపడా తరగతి గదులు, వసతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ విద్య కోసం స్థానికంగా అవకాశాలు లేకపోవడం విద్యార్థులకు మరింత కష్టంగా మారింది. ఎంజేపీటీబీసీ బాలికలు ఇంటర్ చదవాలంటే భద్రాచలం, బాలురు అన్నపురెడ్డిపల్లి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆర్థిక, మానసిక ఒత్తిళ్ల మధ్య ఉన్నత విద్య కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యలో ప్రతిభ చూపుతున్న వెనుకబడిన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు తగిన మౌలిక వసతులు, స్థానికంగా ఇంటర్మీడియట్ విద్యా అవకాశాలు కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -