Sunday, January 18, 2026
E-PAPER
Homeమానవిఉద్యమిస్తేనే హక్కులు

ఉద్యమిస్తేనే హక్కులు

- Advertisement -

ఎప్‌.పుణ్యవతి… విద్యార్థి దశ నుండే ఉద్యమాలతో మమేకమయ్యారు. అమ్మాయిలు, మహిళల సమస్యలను లోతుగా అధ్యయనం చేశారు. మల్లు స్వరాజ్యం వంటి నాయకులతో కలిసి ఎన్నో ఉద్యమాలకు రూపకల్పన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా మహిళలందరినీ ఏకం చేసి ఎన్నో పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఐద్వా అఖిల భారత కోశాధికారిగా బాధ్యతలు చూస్తున్నారు. జనవరి 25 నుండి హైదరాబాద్‌లో జరగబోతున్న ఐద్వా అఖిల భారత మహాసభల విజయవంతం కోసం రాష్ట్ర కమిటీకి తగు సూచనలు చేస్తూ, తన వంతు కృషి చేస్తున్న ఆమెతో మానవి సంభాషణ…

ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల ముందున్న ప్రధాన సవాళ్లు..?
ప్రతీది సవాలుగానే ఉంది. ఎవరో కొంత మంది ఆర్థికంగా ఉన్న వారికి తప్పిదే మెజారిటీ మహిళలకు బతకడమే ఓ సవాలుగా ఉంది. అయితే వీరి సమస్యలు మీడియా ముందుకు రావడం లేదు. మైక్రోఫైనాన్స్‌ దోపిడీపై దేశ వ్యాప్తంగా ఐద్వాగా ఓ సర్వే చేశాం. ఈ సందర్భంగా 9 వేల మంది మహిళలను కలిశాం. మన రాష్ట్రంలో కూడా మూడు వందల మందిని కలిశారు. వీరిలో చాలా మంది తినటానికి గడవక అప్పుల ఊబిలో కూరుకుపోయినవారే. అప్పులోళ్లు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మగవాళ్లు పనుల కోసం వలసలు పోతే కుటుంబ భారం మొత్తం మహిళలపై పడుతుంది. వీళ్లు ఒంటరిగా బతకడం మరీ కష్టం. ఇక పురుషాధిక్య భావజాలంతో చిన్నచూపు, వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువు, వైద్యం ఒక భారంగా మారిపోయింది. భర్తలు, కొడుకులు మద్యం, డ్రగ్స్‌కు బానిసలైతే ఆ భారం కూడా మహిళలపైనే పడుతుంది. ఇవన్నీ మహిళల ముందున్న సవాళ్లే.

ఒకపక్క మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నా మరోపక్క వివక్ష, దాడులు, హింస, చిన్నచూపు పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు?
మహిళలు సాధించిన విజయాలు అంతగా గుర్తింపులోకి రాకపోవడమే ప్రధాన కారణం. డాక్టర్లు, లాయర్లు, సైంటిస్టులుగా చాలా మంది మహిళలు ముందు కొస్తున్నారు. వెనక్కినెడుతున్న ఎన్నో అడ్డంకులు దాటుకొని ముందుకు వస్తున్నారు. అయినా సమాజంలో గుర్తింపు మాత్రం రావడం లేదు. ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీల కృషిని సమాజం గుర్తించలేకపోతుంది. ఎంత చేసినా, ఏం సాధించినా అందులో తప్పులు వెదికి.. ఇంతేనా అనే భావజాలం నరనరాల్లో జీర్ణించుకొనిపోయింది. సంపదను సృష్టించే వ్యవసాయంలో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. కానీ వాళ్లను రైతులుగానే గుర్తించరు.

ఇక అసంఘటిత రంగంలో, భవన నిర్మాణ రంగంలో మహిళల సంఖ్య పెద్దఎత్తున ఉంది. ఉత్పత్తిలో వీరి భాగస్వామ్యం ఎంతో కీలకమైనది. కానీ వారి శ్రమకు గుర్తింపు లేదు. మగవాడే సమాజానికి కీలకం అనే భావన బలంగా ఉంది. ఈ భావజాలంలో మార్పులు రావాలి. రాజ్యాంగంలో మహిళలకు సమానహక్కులు కల్పించినా అవి ఆచరణలో కనిపించడం లేదు. వీటిని అమలు చేయించాల్సిన ప్రభుత్వాలు మహిళలను కించపరిచే మనుధర్మాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. మహిళలు అణిగి మణిగి ఉంటేనా సమాజానికి మంచిది అని నూరిపోస్తున్నారు. ఇలాంటి భావజాలాన్ని తిప్పికొట్టడమే మహిళల కర్తవ్యంగా ఉంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

సైన్స్‌ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సమాజం భక్తి మార్గంలో కొట్టుకుపోతుంది. ముఖ్యంగా మహిళలే దీని ప్రభావంలో పడుతున్నారు. దీనికి కారణం?
భక్తి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గతంలోనూ ఉంది. అయితే గతంలో దేవుడు, భక్తి అనేవి వ్యక్తిగత విషయాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పాలకులు వీటిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. అందుకే ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు. మహిళలు కూడా ప్రశాంతత కోసం తీర్థయాత్రలకు వెళ్లడం, గుడికి వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కానీ మనుషుల మెదడు అభివృద్ధి చెందాలంటే చదువుకోవడానికి పుస్తకాలు ఉండాలి. అంటే లైబ్రరీలు ఏర్పాటు చేయాలి.

గతంలో మహిళలు ఒక దగ్గరికి చేరాలంటే నోములు, వ్రతాలు తప్ప వేరే మార్గం లేదు. దేవుడిని నమ్ముకుంటే అన్నీ పరిష్కారమవుతాయనే నమ్మకం, భయం, భక్తి ఉండేది. అయితే స్త్రీలు కూడా చదువుకోవడం మొదలైన తర్వాత మార్పు మొదలైంది. కాబట్టి పుస్తక అధ్యయనంపై దృష్టి పెట్టాలి. అందుకే ఐద్వా మొదటి మహాసభలు జరిగినప్పుడే మహిళలు చదువుకోవడానికి లైబ్రరీలు కావాలని, ఆటస్థలాలు కావాలని, వాళ్లలోని సృజనాత్మకత పెంచేందుకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్‌ ఉండాలని డిమాండ్‌ పెట్టారు. ఇలాంటివి వస్తే మూఢభక్తి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ కృషి జరగాల్సిన అవసరం ఉంది.

మధ్య తరగతి మహిళల వద్దకు వెళ్లడానికి ఐద్వా చేస్తున్న కృషి..?
మధ్య తరగతి మహిళలు కూడా సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. అయితే వాళ్లను ఉద్యమాల్లోకి ఎలా తీసుకురావాలని అనే ఆలోచన చేయాలి. మీడియా ప్రభావం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. సీరియల్స్‌లో మహిళలను అత్యంత దారుణంగా చూపిస్తున్నారు. టీవీ చూడడం, ప్రవచనాలు వినటం, భక్తి సమాచారం తెలుసుకోవడం వాటిని ఆచరించడం లాంటివి చేస్తున్నారు. వీటి ప్రభావం మధ్య తరగతి మహిళలపై బాగా పడుతుంది. చాలా మంది బయటకు వెళ్లే అవకాశాలు లేక అపార్ట్‌మెంట్స్‌లో కిట్టీ పార్టీలు పెట్టుకొని పూజలు, వ్రతాలు చేసుకుంటున్నారు. వీటికి బదులుగా కొత్తగా ఆలోచించి ఆ కిట్టీ పార్టీలు వారిలో సామాజిక అవగాహన కల్పించేలా ఉంటే బాగుంటుంది. వారిలోని సృజనాత్మకతను పెంచేలా ఉండాలి. ఐద్వాతో పాటు మగిలిన సంఘాలన్నీ ఈ ప్రయత్నం చేయాలి.

నేటి అమ్మాయిల్లో సామాజిక స్పృహ పెరగాలంటే మీరిచ్చే సూచన?
హైస్కూల్స్‌, కాలేజీ పాఠ్యాంశాలలో మార్పులు రావాలి. సామాజిక స్పృహను కల్పించే అంశాలు అందులో చేర్చాలి. అలాగే ప్రతి విద్యా సంస్థలో కౌన్సెలింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ల భావాలు పంచుకునే వేదికలు వాళ్లకు అందుబాటులో ఉండాలి. అప్పుడే వాళ్లు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది.

ఆర్థిక పోరాటాల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందంటారు?
మహిళలు వస్తున్నారు. అయితే కొద్దో గొప్పో ఒకే చోట గుంపులుగా ఉండే మహిళలు మాత్రమే వస్తున్నారు. ఉదాహరణ అంగన్‌వాడీల వంటి స్కీం వర్కర్లు తొందరగా ఒక దగ్గరకు చేరే అవకాశం ఉంటుంది. అలాగే పరిశ్రమల్లో పని చేసే మహిళా కార్మికులు వస్తున్నారు. చాలా మంది ఉద్యమాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. టెక్స్‌టైల్స్‌ కార్మికులున్నారు, వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని భద్రత లేకపోవడం వల్ల కూడా మహిళలు తమ సమస్యలపై మాట్లాడలేకపోతున్నారు.

తరతరాలుగా మహిళలంటే గట్టిగా మాట్లాడకూడదు, రోడ్డెక్కి పోరాడకూడదు అని నూరిపోశారు. ఒక పక్క అసంఘటిత కార్మికులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా ప్రశ్నించలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడితే పని దొరుకుతుందో లేదో అనే భయం. ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు సృష్టిస్తున్న నిరుద్యోగమే దీనికి ప్రధాన కారణం. ఆ సమస్యల నుండి బయటపడడం ఎలాగో తెలియక దేవుడిపై భారం వేస్తున్నారు. వీటి నుండి బయటపడి ఉద్యమాలు చేస్తేనే హక్కులు వస్తాయనే నిజాన్ని మహిళలు గుర్తించాలి.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -