యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని సాయం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమచేస్తామనడంతో ఆశగా రైతులు ఎదురు చూశారు సంక్రాంతి పండుగ పోయింది ఇంకా భరోసా రాకపోవడంతో రైతులు పెట్టుబడులు కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. గత యాసంగి సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్ గత నవంబర్ లో ప్రారంభమైంది.ఈ నెలాఖరు వరకు సీజన్ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు యాసంగి సీజన్ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగి సీజన్లో మండల వ్యాప్తంగా 14,678 ఎక రాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లుగా వ్యవ సాయ శాఖ అంచనా చేసింది. అందులో వరి 14,100 ఎకరాల్లో సాగువుతుందని పేర్కొంది. మండల వ్యాప్తంగా 9,157 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులున్నారు. కానీ ఇందులో గత యసంగిలో 8,337 రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9.49 కోట్లు జమైయ్యాయి. ఈ యాసంగిలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల భరోసాను వెంటనే జమ చేయాలని కోరుతున్నారు.



