అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం. ఈ చిత్రం ఈనెల 8న పీవీర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి జో శర్మ మీడియాతో మాట్లాడుతూ,’ సినిమాలో నా పాత్ర పేరు ‘రాధ’, నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తాను. ఈ సినిమాకి మోహన్, రాహుల్ అడవలతో కలిసి నేను కో-రైటర్‌గా కూడా పనిచేశాను. దీంతో నా పాత్రను మరింత శక్తివం తంగా డిజైన్ చేసుకున్నాను. మా సినిమా రిలీజ్ కాకముందే 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. అలాగే ‘కేన్స్’ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమాను గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. తను హత్యలు చేసిన తర్వాత, ఆ మృత దేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి గొప్ప పెయింటర్ల పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు. ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది అసలు పాయింట్. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది. సినిమాలో హీరోగా ఏసీపీ కృష్ణ పాత్ర ఉంటుంది. విడుదల రోజు ఈ సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాం అని అన్నారు.



