నేడు ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ : బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నబిన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యహరిస్తున్న ఎంపి కె. లక్ష్మణ్ ప్రకటించారు. నబిన్‌కు అనుకూలంగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ పేరు మాత్రమే ప్రతిపాదనకు వచ్చినట్టు లక్ష్మణ్ తెలిపారు. కాగా, సుమారు 18 నెలల అన్వేషణ తరువాత గతేడాది డిసెంబరు 14న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబిన్ ప్రకటించారు. నబిన్‌ను అధికారికంగా ఎన్నుకునే షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈ నెల 16న ప్రకటించారు. దీని ప్రకారం నామినేషన్ ప్రక్రియను సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించారు. మంగళవారం నబిన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. అలాగే, ఈ ఎన్నికను ఆమోదించడానికి బీజేపీ జాతీయ మండలి సమావేశం త్వరలోనే జరగనుంది.



