Saturday, May 9, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వాలకు రైతుల అరిగోస పట్టదా.?: సీపీఐ(ఎం)

ప్రభుత్వాలకు రైతుల అరిగోస పట్టదా.?: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, కఠినమైన కొనుగోలు నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల చక్రపాణి విమర్శించారు. శనివారం పరకాల పట్టణంలో బొచ్చు కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్ళాల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి, అకాల వర్షాలతో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతుంటే, ప్రభుత్వం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో రైతు వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రక్రియ మొదలుపెట్టకపోవడం, మొదలుపెట్టిన చోట రకరకాల కొర్రీలు పెడుతూ జాప్యం చేయడం వల్ల రైతులు నెలరోజులుగా రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు కొనడం చేతగాదు కానీ, పండుగలు చేయడానికి ఉత్సాహం చూపుతారా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలని, తూకం పూర్తయిన బస్తాలను తరలించేందుకు తగినన్ని లారీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొచ్చు ఈశ్వర్, హేమంత్, కృష్ణ, మడికొండ ప్రశాంత్, సామల రాజు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -