Monday, May 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం

మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోడీ
రూ.9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో జట్టు కట్టాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌లో శంకుస్థాపనలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందనీ, నిధుల కేటాయింపులో గత పదేండ్లలో గుజరాత్‌కు సమానంగా తెలంగాణకు కూడా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ‘సీఎం గారూ…వింటున్నారా?’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో గుజరాత్‌కు కేటాయించిన నిధులతో పోల్చి చూస్తే, తెలంగాణకు తమ హయాంలోనే అత్యధిక నిధుల్ని ఇస్తున్నామని వివరించారు. అప్పటి కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణకు సగం నిధులే వస్తాయని చమత్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే బడ్జెట్‌ రూ. వెయ్యి కోట్లు కూడా దాటేది కాదనీ, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ. 5,500 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.

మౌలిక సదుపా యాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నదనీ, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని వివరించారు. రాష్ట్రంలో సైబరాబాద్‌, వరంగల్‌ ప్రాంతాలకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ రెండూ ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. సైబర్‌ టెక్నాలజీ, విద్యుత్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగాల్లో సైబరాబాద్‌ ప్రాజెక్టులు కీలకంగా మారాయని చెప్పారు. వరంగల్‌లో ప్రారంభించిన పీఎం మిత్ర టెక్స్‌టైల్‌ పార్క్‌ ద్వారా స్థానికంగా భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుంది’ అనే నినాదంతో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. తాను కూడా రాజకీయాలు మాట్లాడబోననీ, అయితే అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటుకి చేరలేదని అభిప్రాయపడ్డారు. దీనికోసం తమతో కలిసి పనిచేయాలని రేవంత్‌ సర్కార్‌కు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్రమం త్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజరు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపనలు…ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోడీ హెచ్‌ఐసీసీ వేదిక పైనుంచి వర్చువల్‌ పద్ధతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిలో హైదరాబాద్‌-పనాజీ ఎకనామిక్‌ కారిడార్‌ (ఎన్‌హెచ్‌-167): గుడెబల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు రూ. 3,180 కోట్లతో చేపట్టనున్న 4 లేన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. జహీరాబాద్‌ ఇండిస్టియల్‌ ఏరియాలో రూ. 2,360 కోట్లతో ఈ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.1,250 కోట్లతో పూర్తి చేసిన వివిధ విభాగాల పనులను ప్రారంభించారు. కాజీపేటలో రూ.300 కోట్లతో నిర్మించిన అత్యాధునిక బైపాస్‌లైన్‌ను ప్రారంభించారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఆవరణలో రూ.1,700 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పీఎం మిత్ర పార్క్‌ను జాతికి అంకితం చేశారు. హైదరాబాద్‌ మల్కాపూర్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రూ.610 కోట్లతో నిర్మించిన అత్యాధునిక గ్రీన్‌ ఫీల్డ్‌ పీఓఎల్‌ టెర్మినల్‌ను ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -