నవతెలంగాణ – ఆలేరు టౌను
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, ప్రజా విమోచన పత్రిక పూర్వ సంపాదకులు, సీపీఐ(ఎం-ఎల్) జనశక్తి నాయకులు బండ్రు నరసింహులు సేవలు ప్రజ ప్రశంసనీయమని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు బండ్రు విమలక్క అన్నారు. ఆలేర్ పట్టణంలో గురువారం అమరవీరుల స్తూపం వద్ద బండ్రు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, అమరవీరుల స్మారక స్తూపాల వద్ద వారిరువురి చిత్రపటాలకు అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అమరులకు జోహార్లు చెబుతూ మౌనం పాటించారు.
ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ.. మార్క్సిజం-లేనినిజం- మావో ఆలోచన విధానం వెలుగులో పిడిత ప్రజల విముక్తి కొరకు, భారత విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి, పొట్ల రామ నర్సయ్య, నీలం రామచంద్రయ్య, బండ్రు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు ఎంతోమంది విప్లవ రాజకీయాల వెలుగులో ముందుకు సాగుతూ అమరులయ్యారని గుర్తుచేశారు. వారకి విప్లవ జోహార్లు అర్పించారు. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నగ్జల్బరీ, శ్రీకాకుళం, గోదారిలోయ ప్రతిఘటన పోరాటాలకు వారధిగా,నాయకులుగా అన్నిరకాల అండదండలందించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు ప్రాంతంలో కామ్రేడ్ బండు నరసింహులు, కామ్రేడ్ పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, ఏనుగుల పోచయ్య,కటకం అంజయ్య, బండ్రు నరసమ్మ ఇట్లా ఊరూరా డజండ్ల కొద్ది ఉద్యమం లో కొనసాగినారని గుర్తు చేసారు.
వీరంతా తమకోసం కాకుండా పేద ప్రజల కోసం పోరాడినారని అన్నారు. దోపిడీ,పీడన, అసమానతలు రద్దుకావాలని కోరుకున్నారన్నారు. సారా వ్యతిరేక పోరాటం, జీతగాండ్ల సమ్మె,కూలీ రెట్ల పెంపుకోసం ప్రజలను కార్యోన్ముకులను చేసి వారిని ఉద్యమ పదాన నడిపించడంలో అమరవీరులు ఎంతో కృషి చేసినారని అన్నారు.
పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవడం సరైంది కాదన్నారు. ప్రశ్నించే వారిని పాలకులు అణచివేయాలని చూడం సరైనది కాదన్నారు. అమరులను స్మరించుకుంటూ వారి బాటలో నిజాయితీగా ముందుకు సాగడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అమరుల స్మారక కమిటీ నాయకులు పల్స యాదగిరి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు యాకయ్య,రైతు- కూలీ సంఘం నాయకులు ఇప్ప రామకృష్ణ, ఏనుగుల విష్ణు, నారాయణ శీను,పారెల్లి సత్తయ్య, పెద్దలు, కిష్టయ్య, పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మంగ మల్లేష్,పెంట రమేష్ (లాయర్)బండు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు-బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.



