సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని, విద్య వైద్యానికి ప్రభుత్వము ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యను నిర్వీర్యం చేస్తే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని దోనూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 70 మంది విద్యార్థులకు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సొంత డబ్బులతో స్పోర్ట్స్ దుస్తులను మండల విద్యాధికారి సరస్వతి తో కలిసి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు తారా సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకుంటే భవిష్యత్తులో స్థిరపడతారని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య , అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని చెప్పారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామస్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఎంతో కృషి చేశారని, గత ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యల అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని , పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేది ఉపాధ్యాయులేనని చెప్పారు. ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగారు అని , ప్రతి విద్యార్థి కూడా తన యొక్క లక్ష్యాన్ని ఎంచుకొని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకొని, గ్రామానికి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు.
గ్రామస్తులందరూ ప్రభుత్వ పాఠశాల ను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మయ్య, కృష్ణ నాయక్, వార్డు మెంబర్లు పొర్ల పరుశరాములు, సురేందర్ రెడ్డి, జంగయ్య, రాములు, నందిని, ఆంజనేయులు, జంగయ్య, గ్రామ పెద్దలు జైపాల్ రెడ్డి ,శేఖర్ ,పాండు మల్లయ్య, రవి ,తదితరులు పాల్గొన్నారు .



