సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అనుదీప్
అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల తహసిల్దార్ కి కలెక్టర్ ఆదేశాలు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం(ఎల్)గ్రామంలో ప్రజల సౌకర్యార్థం బైపాస్ ద్వారా రోడ్ నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ మందా కరుణ,ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, మాజీ సొసైటీ అధ్యక్షులు మాధినేని వీరభద్రరావు సీపీఐ(ఎం) బృందంతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
రావినూతల గ్రామం నుండి పొద్దుటూరు వరకు మంజూరైన ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం వల్ల గోవిందాపురం(ఎల్) గ్రామంలోని ఇండ్లు, ప్రహరీ గోడలకు నష్టం జరుగుతుందని గోవిందాపురం(ఎల్) నుండి ఇంటిగ్రేటెడ్ స్కూలు మీదుగా లక్ష్మీపురం వరకు బైపాస్ మార్గం ద్వారా రోడ్డు వేయాలని ఆ వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు. ఈ రోడ్డు ప్రస్తుతం గోవిందాపురం గ్రామం మధ్యగా వెళ్తుండటంవల్ల మా గ్రామంలోని అనేక ఇండ్లు, ప్రహరీ గోడలు, వ్యక్తిగత స్థలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ రోడ్డు నిర్మాణం కొనసాగితే గ్రామస్తుల నివాసాలకు, ఆస్తులకు భారీ నష్టం కలగడమే కాకుండా, ప్రజల భద్రతకూ కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారంగా, గోవిందాపురం ఎల్ గ్రామం నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూలు మీదుగా లక్ష్మీపురం వరకు బైపాస్ మార్గం ద్వారా ఆర్ అండ్ బి రోడ్డును కలపవలసిందిగా ఆ వినతి పత్రంలో కోరారు.
అదేవిధంగా గ్రామంలోని పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వివరించారు. గోవిందాపురం ఎల్ గ్రామానికి గతంలో ఉన్న బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ సానుకూలంగా స్పందించినట్లు మందా కరుణ తెలిపారు. తక్షణమే బోనకల్ తహసీల్దార్ ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు.



