దేవాదాయ శాఖలో 20 ఏండ్లుగా తిష్ట
సర్కారు ఏదైనా ఆ పోస్టుల్లో ఆ అధికారులే
అక్కడ పాతుకుపోయి శాఖపై ఆధిపత్యం
బదిలీల కోసం మొరపెట్టుకుంటున్న ఇతర ఉద్యోగులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాధారణంగా మూడేండ్లకొసారి ప్రభుత్వ ఉద్యోగ బదిలీలు జరుగుతుంటాయి. అదేందో కానీ రాష్ట్ర దేవాదాయ శాఖలో రెండు దశాబ్దాలుగా కొంత మంది అధికారులు తిష్ట వేయడం చర్చనీయాంశమవుతున్నది. ఎన్ని విమర్శలొచ్చినా వారు మాత్రం కుర్చీ వదలట్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారి స్థానం పదిలమే. ప్రభుత్వంతో సంబంధం లేదు. పార్టీలతోనూ సంబంధం లేదు. సర్కారు ఏదైనా బదిలీ అనేది లేకుండా మేనేజ్ చేసుకుంటున్నారనే అభిప్రాయం కింది స్థాయి ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. ఉద్యోగులు పాతుకుపోవడంతో ఆ స్థానాల్లోకి రావాల్సిన వారు, ప్రత్యేక అవసరాలున్న ఉద్యోగులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా బదిలీ కాలేకపోతున్నామనే ఆందోళన వ్యక్తమవుతున్నది. బదిలీల కోసం ఇతర ఉద్యోగులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి బాధ అరణ్య రోదనగానే మిగిలిపోతోంది.
ఒక చోట బదిలీలు ఆగిపోతే దాంతో ముడిపడి ఉన్న ఎన్నో బదిలీలు లేకుండా పోతున్నాయి. కొన్ని సార్లు ప్రభుత్వాలు బదిలీల ప్రక్రియ చేపట్టినా, బదిలీ మీద వెళ్లి తిరిగి అదే స్థానంలోకి వస్తున్నారంటే వారు ఎంత ప్రభావితం చేస్తున్నారో అర్థమవుతున్నది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒకరిద్దరు ఉన్నతాధికారులు రెండు దశాబ్ధాలుగా స్థానం చలనం లేకుండా ఉన్నారు. ముఖ్యంగా అదనపు కమిషనర్లు ఒకరు 11 ఏండ్లు, మరొకరు పదేండ్లు, ఇంకొరు తొమ్మిదేండ్లు, మరో అదనపు కమిషనర్ ఏడేండ్లుగా అక్కడే తిష్టవేశారు. హైదరాబాద్‌లోని ఏదో దేవాలయానికి ఈవోగా వెళ్లడం తిరిగి హెడ్డాఫీస్‌కు రావడం పరిపాటిగా మారింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కమిషనర్లు 35 ఏండ్లుగా కూర్చీ వదలడం లేదు. అసిస్టెంట్ ఇంజినీర్లు కూడా తొమ్మిదేండ్లు, ఐదేండ్లుగా కొనసాగడం విశేషం.
దేవాదాయ శాఖలో దీర్ఘకాలిక పదవుల్లో కొనసాగడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్నట్టుగానే దేవాదాయ శాఖలో సాధారణ బదిలీలను చేపట్టాలనే డిమాండ్ పెరుగుతున్నది. 62 మంది ఈవోలు కొన్నేండ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మందిని బదిలీ చేసి వారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో కూడా ఇక్కడి నుంచి కదలడం లేదు. దీనివల్ల పరిపాలనా కేంద్రీకృతమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఒక సీనియర్ మహిళా అధికారిణి, గతంలో దాదాపు దశాబ్దం పాటు విజిలెన్స్ విభాగంలో పనిచేసి ఇప్పటికీ అదే విభాగంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా చాలా ఏండ్లుగా ఒకే విభాగంలో పని చేసిన ఒక డిప్యూటీ కమిషనర్‌ను ఓ ఆలయానికి బదిలీ చేయగా కొద్ది కాలంలోనే ఆయన సికింద్రాబాద్‌లోని ఒక ప్రముఖ ఆలయానికి తిరిగి బదిలీ మీద వచ్చారు. పైగా, ఆయనకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
డిప్యూటీ కమిషనర్ (సర్వీసెస్), డిప్యూటీ పీఠాలు పదిలం! ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంటి పదవులలోని అధికారులు రొటేషన్ లేకుండా చాలా కాలం పాటు అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. పోస్టింగ్‌లు పోడిగించడం, అదనపు బాధ్యతలను అప్పగించడం, కొత్త పోస్టులు లేకపోవడం, సాధారణ బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. దేవాదాయ శాఖకు ప్రస్తుతం కొత్తగా కమిషనర్ రావడంతో ఉద్యోగుల బదిలీలపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఆయన కమిషనర్‌గా ఉన్న సమయంలో బదిలీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సమయంలో ఫిర్యాదులు రాలేదు. ప్రస్తుతం అదే అధికారి మళ్లీ కమిషనర్‌గా పని చేస్తుండటంతో శాఖలో కూడా అదే విధమైన నిష్పక్షపాత, పారదర్శక బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. మిగతా ఉద్యోగుల మొరను ఆలకించి రాష్ట్ర సర్కారు ఆ శాఖలో బదిలీలు చేపడుతుందా? లేదా? అని వేచిచూడాలి.



