కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కేఆర్‌ఎంబీ నిర్ణయం
ఈ నెల 14న మరోసారి సమావేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వేసవిలో తాగు నీటి అవసరాలకు గాను తెలంగాణకు 22 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఏ రాష్ర్టానికి ఎంత నీరు విడుదల చేయాలనే అంశంపై చర్చించి ఈ వేసవి వాటాలను బోర్డు నిర్ణయించింది. తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 5 టీఎంసీల వినియోగానికి కేఆర్‌ఎంబీ అనుమతిచ్చింది. ఏపీ ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకుందని సమావేశంలో తెలిపిన తెలంగాణ, సాగర్‌లో ఏపీకి 10 టీఎంసీలు పోగా మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని వాదించింది. తాగునీటి అవసరాల కోసం నీటిని అడుగుతున్నట్టు ఏపీ ఈఎన్సీ తెలిపారు. మిగతా అంశాలు కాకుండా అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుందామని బోర్డు సభ్య కార్యదర్శి తెలిపారు. దాంతో రెండు రాష్ట్రాలు బోర్డు నిర్ణయాన్ని అంగీకరించారు. కాగా తమకు 18 టీఎంసీలు కావాలని తెలంగాణ అభ్యర్థించగా, మరో మూడు టీఎసీలు అదనంగా కేటాయించడం గమనార్హం. ఈ ఒప్పందం ఆగస్టు 15 వరకు అమల్లో ఉంటుందని కేఆర్‌ఎంబీ వర్గాలు తెలిపారు. ఈ నెల 14న కేఆర్‌ఎంబీ 21వ సమావేశం జరగనుంది. కష్ణానది నీటి వాటాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజు, తెలంగాణ, ఏపీలకు చెందిన ఈఎన్‌సీలు రమేశ్‌బాబు, నరసింహమూర్తి పాల్గొన్నారు.
తెలంగాణకు 22, ఏపీకి 10 టీఎంసీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



