Friday, January 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజా శాంతి మండలి ఏర్పాటు

గాజా శాంతి మండలి ఏర్పాటు

- Advertisement -

ప్రకటించిన ట్రంప్‌
ముందుకొచ్చిన 35మంది నేతలు
ఇది ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయమా?
ట్రంప్‌ వ్యాఖ్యలతో రేగిన అనుమానాలు

దావోస్‌ : గాజాకు ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ (శాంతి మండలి)ని ఏర్పాటు చేసినట్లు ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ ఘర్షణలను పరిష్కరించుకునేందుకు ఉద్దేశించిన ఈ సంస్థలో శాశ్వత సభ్యత్వం కావాలంటే వంద కోట్ల డాలర్లు చెల్లించాలని పేర్కొన్నారు. దావోస్‌లో గురువారం ఈ మేరకు ట్రంప్‌ ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ నిబంధనావళిపై సంతకాలు చేశారు. ఇక ఈ నిబంధనావళి పూర్తిగా అమల్లోకి వచ్చిందని, ఇక గాజా శాంతి మండలి అధికారిక అంతర్జాతీయ సంస్థ అని వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లెవిట్‌ ప్రకటించారు. గాజా పునర్నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఈ మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు తొలుత ప్రకటించినా, ఈ మండలి ముసాయిదా నిబంధనావళిని చూస్తుంటే కేవలం పాలస్తీనా భూభాగానికే దీని పాత్ర పరిమితమవున్నట్లు కనిపించడం లేదు.

11పేజీల నిబంధనావళిలో గాజా పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. గాజాకే పరిమితం కాకుండా ఇతర అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారానికి కూడా ఈ మండలి పనిచేస్తుందని ట్రంప్‌ ప్రకటించడం చూస్తుంటే ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ ఘర్షణలు, సంక్షోభాల పరిష్కార వ్యవహరాలన్నీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఒకసారి ఈ బోర్డు గనక ఏర్పాటు చేయడం పూర్తయితే మనం ఏం చేయాలనుకున్నామో అది చక్కగా చేయవచ్చని ట్రంప్‌ డావోస్‌ సమావేశాల వేదికపై వ్యాఖ్యానించారు.
గాజాలో కాల్పుల విరమణకు కృషి చేసిన అమెరికా అధికారులందరినీ ఆయన ప్రశంసించారు. గాజాలో శాంతి సాధ్యమని ఎవరూ భావించలేదని కానీ తాము చేసి చూపించామని చెప్పుకున్నారు.

ముందుకొచ్చిన 35మంది నేతలు
ఈ శాంతి మండలిలో చేరేందుకు ఇప్పటివరకు ట్రంప్‌ దాదాపు 50మంది నేతలకు ఆహ్వానాలు పంపగా 35మంది ప్రపంచ నేతలు ముందుకొచ్చారు. గాజా శాంతి మండలిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన దేశాల్లో మధ్య ప్రాచ్యంలో అమెరికా మిత్రపక్షాలైన ఇజ్రాయిల్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, జోర్డాన్‌, కతార్‌, ఈజిప్ట్‌లు వున్నాయి. నాటో సభ్య దేశాలు టర్కీ, హంగరీలు వున్నాయి. అలాగే పాకిస్తాన్‌, మొరాకో, ఇండోనేషియా, కొసావొ, ఉజ్బెకిస్తాన్‌, కజకస్తాన్‌, పరాగ్వే, వియత్నాం, అర్జెంటైనా, అజర్‌బైజాన్‌, అర్మేనియాలు కూడా చేరేందుకు ముందుకు వచ్చాయి. కాగా చైనా, జర్మనీ, ఇటలీ, రష్యా, స్లొవేనియా, ఉక్రెయిన్‌ వంటి దేశాలు ట్రంప్‌ ఆహ్వానంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇది కార్యాచరణ మండలి
గాజాలో శాంతిని శాశ్వతంగా నెలకొల్పాలన్నది ఈ బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ లక్ష్యమని, అయితే ఈ సంస్థకు వున్న అవకాశాలు అనంతమైనవని విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో వ్యాఖ్యానించారు. ఇది కేవలం శాంతి మండలి కాదు, కార్యాచరణ మండలి, అధ్యక్షుడు ట్రంప్‌ కార్యాచరణ అధ్యక్షుడు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్య సమితిని దెబ్బతీయడానికా ?
నిబంధనావళిపై సంతకాలు చేస్తూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ శాంతి మండలి ఐక్యరాజ్య సమితిని దెబ్బతీస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితితో సహా అనేకమందితో కలిసి ఈ మండలి పనిచేస్తుందని ట్రంప్‌ చెప్పారు. ఈ ప్రాంతంలో, ప్రపంచవ్యాప్తంగా గల అనేక ముఖ్యమైన దౌత్య సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజాలో విజయం సాధించిన తర్వాత మనం ఇతర అంశాలకు కూడా దీన్ని విస్తరించవచ్చన్నారు. ఐక్యరాజ్య సమితి మరింత శక్తి సామర్ధ్యాలతో ఇంకా పనిచేయాల్సి వుందని నేనెప్పుడూ చెబుతుంటాను, కానీ అలా జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -