ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ ఢీ నేడు
వరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేయగా, ముంబయి ఇండియన్స్ గత ఐదు మ్యాచ్‌ల్లో 4 ఓటములు చవిచూసింది. టాప్-4 రేసులో ముందంజ వేసేందుకు సన్‌రైజర్స్ ఎదురుచూస్తుండగా.. పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు ముంబయి ఇండియన్స్ ఓ విజయం వేటలో నిలిచింది. గ్రూప్ దశ ద్వితీయార్థం జోరందుకున్న తరుణంలో నేడు వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
నవతెలంగాణ-ముంబయి
ఐపీఎల్ ఐదు సార్లు చాంపియన్ ముంబయి ఇండియన్స్ గాడిలో పడేందుకు తంటాలు పడుతోండగా.. మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో దూసుకెళ్తోంది. ముంబయి ఇండియన్స్‌లో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. అయినా, ఆ జట్టు సమిష్టిగా రాణించటంలో నిలకడగా నిరాశపరుస్తోంది. మరోవైపు సీనియర్, జూనియర్ క్రికెటర్లు సమిష్టిగా మెరవటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకుంటోంది. వరుసగా నాలుగు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ భీకర ఫామ్‌లో కనిపిస్తోంది. మరో విజయంపై కన్నేసి నేడు వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌తో సమరానికి సై అంటోంది. సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.
ఆరెంజ్ ఆర్మీకి ఎదురుందా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ భీకర ఫామ్‌లో ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్ రాకతో డ్రెస్సింగ్‌రూమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. బౌలింగ్ దళానికి నాయకుడు లేని లోటు ప్రథమార్థంలో స్పష్టంగా కనిపించింది. యువ పేసర్లు, స్పిన్నర్లను పాట్ కమిన్స్ ముందుండి నడిపిస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. సకిబ్ హుస్సేన్, ఈషన్ మలింగ, శివాంగ్ కుమార్, హర్ష్ దూబెలు గొప్పగా రాణిస్తున్నారు. పసలేని బౌలింగ్ అంటూ విమర్శలు వచ్చినా.. ఇప్పుడు సన్‌రైజర్స్‌కు దీటైన బౌలింగ్ తయారైంది. బ్యాట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లోనే అత్యంత ప్రమాదకర జట్టు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లు ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా అద్భుతాలు చేస్తున్నాడు. టాప్ ఆర్డర్‌లో ట్రావిశ్ హెడ్ ఒక్కడే నిరాశ పరుస్తున్నాడు. అచ్చొచ్చిన ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్‌పై ట్రావిశ్ హెడ్ సైతం పరుగుల వేట మొదలెడితే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. యువ బ్యాటర్లు అనికెత్ వర్మ, సాలిల్ అరోరా డెత్ ఓవర్లలో నిలకడగా ఎదురుదాడి చేయటంపై ఫోకస్ పెట్టాలి. బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడెలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబయి ఇండియన్స్ ఎదురించటం కష్టమే!.
గాడిలో పడతారా?
ముంబయి ఇండియన్స్ ఏ పరిస్థితుల్లోనైనా బలమైన జట్టే. ఐదు సార్లు చాంపియన్‌ను తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. గుజరాత్ టైటాన్స్‌పై తిలక్ వర్మ శతకంతో గెలుపు బాట పట్టినా.. సూపర్‌కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాట్‌తో, బంతితో అంచనాలను అందుకోవాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జశ్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ సమిష్టిగా రాణించటం లేదు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నా.. అతడికి సహచరుల నుంచి సహకారం కరువైంది. కీలక ఆటగాళ్లు మెరిస్తే గెలుపు బాట పట్టడం ముంబయి ఇండియన్స్‌కు పెద్ద విషయం కాబోదు. నేడు సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నిలువరించి ముంబయి ఇండియన్స్ వరుస ఓటములకు చెక్ పెడుతుందా? ఆసక్తికరం.



