సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యనాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యనాయక్ అన్నారు. గురువారం ఆయన మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వీర యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీరనారి అని, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు.
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేటికీ పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భూమి, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్య ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్ మల్లేష్, సీపీఐ(ఎం) అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు, సీపీఐ(ఎం) నాయకురాలు నిర్మల, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి పర్వతాలు, రాములు తదితరులు పాల్గొన్నారు.



