Wednesday, April 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతుల అగచాట్లు

రైతుల అగచాట్లు

- Advertisement -

సొసైటీలకు లేని పాలకవర్గాలు ఇష్టారాజ్యంగా పలువురు అధికారులు

ధాన్యం కొనుగోళ్లలో రైతుల అరిగోస కాంటాలు పెట్టడంలో, తరలించడంలో మీనమేషాలు
అన్‌లోడింగ్‌కు కూడా ప్రాధేయపడాల్సిందే.. వర్షాలు పడితే కొర్రీలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న రైస్‌మిల్లర్లు

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రైతులకు ధాన్యం పండించడం ఒకెత్తయితే.. వాటిని విక్రయించడం మరో ఎత్తు అవుతుంది. చేతికొచ్చిన పంటను సకాలంలో కాంటా చేయించి రైస్‌మిల్లులకు తరలించి అన్‌లోడ్‌ చేయించడానికి తీవ్ర అగచాట్లు పడాల్సి వస్తోంది. దీనికి తోడు సొసైటీలకు పాలకవర్గాలు సైతం లేక రైతుల కష్టాలు తీవ్రమయ్యాయి. సొసైటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పలు చోట్ల అధికారులు, సీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లపై పర్యవేక్షణ కొరవడింది. ఈ క్రమంలో వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సొసైటీలతో రైతులకు దగ్గరి సంబంధం ఉంటుంది. యూరియా, ఎరువులు, విత్తనాలు మొదలు పంటల కొనుగోలు వరకు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 144 సొసైటీలున్నాయి. అయితే, వాటికి పాలకవర్గాల పదవీకాలం పూర్తికావడంతో పలువురు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. ఈ క్రమంలో పాలకవర్గాలను నియమించడం లో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం పెద్దఎత్తున ధాన్యం సేకరించే సమయం కాగా.. సొసైటీల నుంచి సహకారం అంతంతగానే అందుతుందని రైతులు వాపోతున్నారు. సరిపడా కూలీలను తీసుకొచ్చి రెండు నుంచి మూడు కాంటాలు పెట్టాల్సి ఉండగా.. కొన్ని చోట్ల ఒక్క కాంటాతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి. దీంతో వడ్ల కుప్పలు ఎక్కడికక్కడా పేరుకుపోయాయి. అధికారులను అడిగితే.. ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సొసైటీలకు పాలకవర్గాలు ఉంటే ఎక్కడికక్కడా సర్దుబాటు చేస్తూ వేగంగా కొనసాగించేవారని పేర్కొంటున్నారు.

శాఖల మధ్య సమన్వయ లోపం
ధాన్యం సేకరణలో ప్రధానంగా పౌరసరఫరాల శాఖ, సహకార శాఖతోపాటు వ్యవసాయ, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్‌ శాఖలు కీలకంగా వ్యవహరించాలి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. తూకం మొదలు ఇతరాత్రా సమస్యలను సొసైటీ అధికారులను అడిగితే అది తమ పరిధి కాదని దాటవేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. పాలకవర్గాలు ఉంటే రైతులు నేరుగా తమ సమస్యలను చైర్మెన్‌తో పాటు సభ్యుల దృష్టికి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడూ పరిష్కరింపజేసుకునే వారమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలుపై దృష్టిసారించాలని, శాఖల మధ్య సమన్వయం చేసి ఎప్పటికప్పుడూ ధాన్యం తూకం వేసి తరలించే విధంగా చూడాలని కోరుతున్నారు.

లోడింగ్‌, అన్‌లోడింగ్‌లోనూ..
నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 669 కొనుగోలు కేంద్రాల ద్వారా 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. కామారెడ్డిలో సుమారు 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకుగాను 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంటా వేయడంలో ఆలస్యం చేస్తుండగా.. లారీలు పంపి రైస్‌మిల్లులకు తరలించడంలోనూ ప్రాధేయపడాల్సిన పరిస్థితి. ఎవరైనా రైతులు ముందుకు ప్రయివేటుగా లారీని మాట్లాడుకొని ధాన్యం రైస్‌మిల్లుకు తరలిస్తే అక్కడ అన్‌లోడింగ్‌ చేయకపోవడంతో లారీ కిరాయి మీద పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపాల్‌ మండలంలోని బోర్గాం(పి) సొసైటీ పరిధిలో ఓ రైతు ప్రయివేటు లారీలో ధాన్యం రైస్‌మిల్లుకు తరలించి మూడ్రోజులవుతున్నా ఇంకా అన్‌లోడ్‌ చేయకపోవడంతో కిరాయి మీద పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ధాన్యం వెయిట్‌ లాస్‌ అవుతుందని వాపోతున్నారు.

అన్‌లోడ్‌ చేస్తలేరు
భూమిని కౌలుకు తీసుకొని సాగుచేశా. తూకం వేసిన ధాన్యం తరలించేందుకు స్పందించడం లేదు. మేఘం రోజూ ఉరుముతోంది. వర్షం కురిస్తే నష్టపోతానని భావించి ప్రయివేటు లారీని మాట్లాడుకొని బోర్గాం(పి) సొసైటీ పరిధితో మాకు కేటాయించిన కనకదుర్గ రైస్‌మిల్‌కు పంపాం. మూడు రోజులవుతున్నా ఇంకా ధాన్యం దించుకోలేదు. జాగ లేదని చెబుతున్నారు. లారీ కిరాయి మీద పడుతోంది. సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. మా సొసైటీకి పాలకవర్గం ఉంటే అక్కడికి వెళ్లి గట్టిగా మాట్లాడేవాళ్లం.
కె.భుజేందర్‌, తానాకుర్తి. మోపాల్‌(మం)

ధనాధన్‌ కాంటాలైతుండే..
ఊర్లే ఎక్కడి ధాన్యం కుప్పలు అక్కడే ఉన్నాయి. మా ఊరికి గతంలో ఎప్పుడైనా రెండు కాంటాలు పెడుతుండే. ఈసారి ఒక్కటే పెట్టిర్రు. ఇంకోటి పెట్టాలని అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సొసైటీలకు పాలవకర్గాలు ఉంటే కాంటాలు ధనాధన్‌ నడుస్తుండే. కూలీల కొరత ఉన్నా, లారీల సమస్య ఉన్నా ఎప్పటికప్పుడూ చైర్మెన్‌లు మాట్లాడి ఏర్పాట్లు చేస్తుండే. ఇప్పుడు అధికారులు ఆ పని చేయడం లేదు.
మల్కరెడ్డి, తాడెం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -