Friday, August 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్దారి దూరమై..ప్రమాద దారిలో విద్యార్థులు..

దారి దూరమై..ప్రమాద దారిలో విద్యార్థులు..

- Advertisement -

– శంకుస్థాపన చేసి రెండేండ్లు… ప్రారంభం కాని బ్రిడ్జి నిర్మాణ పనులు…
– ప్రమాదపు అంచున విద్యార్థుల నడక…
– సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో…
– పట్టించుకోని పాలకవర్గాలు…

నవతెలంగాణ-నవీపేట్: మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు దారి దూరమై ప్రమాదకరంగా ఉన్న అలీ సాగర్ లిఫ్టు కాల్వపై గల నీటి పైపు పైనుండి రోజు వెళ్తూ వస్తున్నారు. రెండేండ్ల క్రితమే రాష్ట్ర ముఖ్య సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను తీసుకువెళ్లగా స్పందించి శంకుస్థాపన చేసి ఇరిగేషన్ అధికారులను బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన చేయాలని ఆదేశించారు. కానీ ఏడాది గడుస్తున్నా ఇరిగేషన్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తమ శాఖలో నిధులు లేవని అలాగే అదే లిఫ్టు కాల్వపై ఆర్ అండ్ బి రోడ్డు బ్రిడ్జి పైనుండే వెళ్లడంతో అధికారికంగా సమస్యను పరిష్కరించలేమని మౌనంగానే ఉండిపోయారు.
బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు ప్రమాదపు అంచున నడక సాగిస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులు కాలువపైనున్న పైపు పైనుండి, కాలువ లోపలి నుండి వెళ్తున్న వీడియోను విద్యార్థి నాయకుడు ఒకరు గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పంపడంతో చాలామంది ఆ వీడియోకు ఆకర్షితులై వాట్సాప్ స్టేటస్ లో పెట్టాగా వైరల్ గా మారింది. ఇంత తీవ్రమైన సమస్యను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించలేని నాయకులు స్థానికంగా ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగే వరకు చూడకుండా ఇప్పటికైనా పాలకవర్గాలు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -