అగమ్యగోచరంగా అమెరికా పరిస్థితి చర్చలపై ఇరాన్ సమాలోచనలు
అగమ్యగోచరంగా అమెరికా పరిస్థితి
ముందుకెళ్తే చైనా..వెనక్కొస్తే ఇరాన్
యుద్ధంలో ఇరుక్కున్న ట్రంప్
ఒపెక్, ఒపెక్ ప్లస్‌కు యూఏఈ గుడ్‌బై
టెహ్రాన్/వాషింగ్టన్ : రష్యా అందిస్తున్న మద్దతుకు, సంఘీభావానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. అరాగ్చీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను నివారించే విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సానుకూలత వ్యక్తం చేసిందని సమాచారం.
చర్చలను తిరిగి ప్రారంభించాలన్న అమెరికా అభ్యర్థనను ఇరాన్ పరిశీలిస్తోందని అరాగ్చీ తెలిపారు. తొలి విడత చర్చలు విఫలం కావడానికి అమెరికాయే కారణమని ఆయన ఆరోపించారు. ఇరాన్‌కు చెందిన రెండు చమురు నౌకలు మెజెస్టిక్ ఎక్స్, తిఫానీలను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై టెహ్రాన్ విదేశాంగ శాఖ మండిపడింది. ఈ చర్య సముద్ర దోపిడీని చట్టబద్ధం చేస్తోందని ధ్వజమెత్తింది. ఇదిలావుండగా యుద్ధానికి ముగింపు పలికేందుకు, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అందజేసిన తాజా శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా బృందం సమీక్షిస్తోంది. చర్చలలో తమ అణు కార్యక్రమాన్ని ప్రస్తావించవద్దని, దానిపై తర్వాత చర్చిద్దామని ఇరాన్ సూచించింది. అయితే ఇరాన్ ప్రతిపాదనలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారని, వాటిని ఆయన ఆమోదించబోరని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. హార్ముజ్ జలసంధిని తక్షణమే, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెరవాలంటూ పలు దేశాలు కోరుతున్నాయి. బV్‌ారైన్ నేతృత్వంలో ఆయా దేశాలు ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
దిగ్బంధాన్ని తప్పించుకొని హార్ముజ్‌ను దాటుతున్న నౌకలు
హార్ముజ్ జలసంధిని అమెరికా నౌకాదళం దిగ్బంధించినప్పటికీ అనేక చమురు నౌకలు దానిని దాటుకొని ప్రయాణం సాగిస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు తూర్పు వైపున మోహరించిన అమెరికా దళాలు నౌకల రాకపోకలను నియంత్రిస్తూ, ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవి నుంచి నేరుగా ముంబయికి చేరుకునే మార్గం ఒకటుందని పరిశీలకులు తెలిపారు.
ఇటీవలే దేశ్ గరిమ అనే భారత నౌక జలసంధిని దాటింది. జగ్ అర్నవ్, సన్మర్ హెరాల్డ్ నౌకలపై ఇరాన్ సేనలు కాల్పులు జరిపిన రోజే దేశ్ గరిమ నౌక హార్ముజ్‌ను దాటేసింది. అది గత బుధవారం ముంబయికి చేరుకుంది. ఖతార్‌లోని రాస్ లాఫన్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో 97 వేల మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. ఒక్క దేశ్ గరిమ మాత్రమే కాదు…ఈ నెల 13న అమెరికా దిగ్బంధం అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకూ 30కి పైగా నౌకలు హార్ముజ్‌ను దాటాయి. వివిధ దేశాలకు చెందిన నౌకలు ఇరాన్ నుంచి ముంబయి వైపు వస్తున్నాయని వార్తలు అందుతున్నాయి. అయితే ఈ సమాచారాన్ని భారత్, టెహ్రాన్ అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
ఇప్పటి వరకూ 34 నౌకలు అమెరికా దిగ్బంధాన్ని దాటుకొని బయటికి వచ్చాయని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తెలిపింది. హార్ముజ్ నుంచి బయటికి వచ్చిన నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో ప్రవేశిస్తున్నాయని చెప్పింది. కాగా ప్రస్తుతం హార్ముజ్‌లో ఇంకా 14 భారత నౌకలు ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
హార్ముజ్‌పై నియంత్రణ ఇరాన్‌దే : ఐరాసలో రష్యా
హార్ముజ్ జలసంధిని నియంత్రించే హక్కు ఇరాన్‌కే ఉన్నదని రష్యా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో రష్యా రాయబారి వస్సిలీ నెబెంజియా మాట్లాడుతూ భద్రతా కారణాల దృష్ట్యా తన ప్రాదేశిక జలాలలో నౌకల రాకపోకలను నియంత్రించే అధికారం దాడికి గురైన తీర ప్రాంత దేశానికి ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఇరాన్‌పై పూర్తి బాధ్యత మోపేందుకు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. ఆత్మరక్షణ కోసమే పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోందని, అయితే వాటిని సాకుగా చూపి టెహ్రాన్‌పై నిందలు వేస్తున్నారని అన్నారు. పశ్చిమ దేశాలు కపటత్వానికి, ఆధునిక కాలపు సముద్ర దొంగతనానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. నల్ల సముద్రంలో రష్యా వాణిజ్య నౌకలపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు ఆ దేశాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. సంప్రదాయ సముద్ర దొంగలు తమ చట్టవిరుద్ధ చర్యల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తుంటే ఈ దేశాలు మాత్రం ఏకపక్ష నిర్బంధ చర్యల ముసుగులో వారి దౌష్ట్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని అంటూ దీనిని ఓ రకమైన అంతర్జాతీయ సముద్ర దోపిడీగా వస్సిలీ నెబెంజియా అభివర్ణించారు.
డిజిటల్ ప్రపంచానికీ హార్ముజ్ కీలకమే
హార్ముజ్ జలసంధి కేవలం అంతర్జాతీయ చమురు వాణిజ్యానికే కాదు…డిజిటల్ ప్రపంచానికి కూడా కీలకమైనదే. ఎందుకంటే హార్ముజ్ జలాలలో ఏర్పాటు చేసిన భూగర్బ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ భారత్, ఆగేయాసియా దేశాలను గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్ ద్వారా యూరప్‌తో అనుసంధానిస్తున్నాయి. డేటా, పవర్ ట్రాన్స్‌మిషన్ కోసం సముద్రంలో ఫైబర్ ఆప్టిక్ లేదా ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 99 శాతం వరకూ వీటి ద్వారానే నడుస్తుంది. కమ్యూనికేషన్స్, విద్యుత్‌కు కూడా ఈ కేబుల్సే ఆధారం. కేబుల్స్‌కు నష్టం జరిగితే ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది లేదా నిలిచిపోతుంది. ఈ-కామర్స్‌కు అంతరాయం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆలస్యమవుతాయి. వీటన్నింటి కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాలు…ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియాలు ఏఐ, డిజిటల్ మౌలిక సదుపాయాలపై అనేక బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. తద్వారా చమురుపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి.
కోర్టులో అలెన్‌పై ఆరోపణలు
వైట్‌హౌస్ కరస్పాండెంట్ల విందులో కాల్పులు జరిపిన కోల్ తామస్ అలెన్‌ను మంగళవారం తొలిసారిగా వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులోని ఓ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అతనిపై మూడు ఆరోపణలు మోపారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు అలెన్ ప్రయత్నించాడన్నది వాటిలో తీవ్రమైనది. నేరం రుజువైతే అలెన్‌కు జీవిత ఖైదు శిక్ష పడుతుంది. అతనిపై ఆయుధ నేరాల ఆరోపణ కూడా మోపారు. న్యాయమూర్తి ఎదుట అలెన్ ఎలాంటి వాదనలు వినిపించలేదు. అతనిని గురువారం మరోసారి కోర్టులో ప్రవేశపెడతారు. అలెన్ తన వెంట కత్తులు, తుపాకులు తీసుకొచ్చాడని, దాడికి ముందు కుటుంబసభ్యులకు ఈ మెయిల్ పంపాడని న్యాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే దాడికి నిర్దిష్ట కారణమేమిటో ఇంకా తెలియలేదని చెప్పారు. సంఘటనా స్థలం వద్ద పాటించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను కూడా వారు ప్రస్తావించారు. కాగా అధ్యక్షుడి భద్రతలో మార్పులు జరగవచ్చునని వైట్‌హౌస్ తెలిపింది. కాల్పుల ఘటనపై సీక్రెట్ సర్వీస్ స్పందనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పింది. అయితే అధ్యక్షుడి భద్రతా ప్రొటోకాల్‌లో మార్పులకు సంబంధించి ఈ వారంలో సమావేశం జరుగుతుందని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు.
ఐరాసలో అమెరికా, ఇరాన్ మధ్య వాగ్యుద్ధం
ఐక్యరాజ్యసమితిలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. 1970వ దశకంలో అమలులోకి వచ్చిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సోమవారం 11వ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశ నిర్వహణకు 34 మంది ఉపాధ్యక్షులను ఎంపిక చేయగా అందులో ఇరాన్ కూడా ఉంది. అలీన దేశాలు ఇరాన్‌ను ఆ పదవికి ఎంపిక చేశాయి. అయితే ఇరాన్‌ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఒప్పందాన్ని అవమానపరచడమేనని అమెరికా సీనియర్ అధికారి క్రిస్టొఫర్ విమర్శించారు. ఒప్పందానికి ఇరాన్ చాలా కాలంగా కట్టుబడి ఉండడం లేదని, తన అణు కార్యకలాపాలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు సహకరించేందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ప్రతినిధి రెజా నజాఫీ తోసిపుచ్చారు. అవి నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడినవని అన్నారు. వాషింగ్టన్ అణు చరిత్రను, దాని ఆయుధ నిల్వల విస్తరణను ఎత్తిచూపారు.



