సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్
మహిళా సంఘం జిల్లా నాయకురాలు మోరిగాడి స్వరూప
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పీడిత ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడటమే మహనీయ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, మహిళా సంఘం జిల్లా నాయకురాలు మోరిగాడి స్వరూప పేర్కొన్నారు.దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, సిబ్బందికి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మహోన్నత నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.ఉన్నత వర్గ కుటుంబంలో జన్మించినప్పటికీ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తన పేరులోని కులాన్ని తొలగించి సమానత్వ భావనకు కట్టుబడి జీవించారని గుర్తు చేశారు.కార్మికులు, కర్షకుల హక్కుల కోసం తన కుటుంబంలోనే పోరాటం ప్రారంభించి శ్రమజీవుల ఐక్యత కోసం కృషి చేసిన వ్యక్తిగా ఆయనను కొనియాడారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కార్మిక–కర్షక ఐక్యతే మార్గమని సుందరయ్య విశ్వసించారని,సమాజంలో పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పటికప్పుడు నొక్కిచెప్పారని అన్నారు.నేటి రాజకీయాల్లో పదవులను స్వప్రయోజనాలకు వినియోగించే పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన నిరాడంబర జీవనశైలిని కొనసాగించారని తెలిపారు.తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి భూమిలేని పేదలకు భూములు దక్కేలా పోరాడటంలో కీలక పాత్ర పోషించారని, నైజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాలను నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, జలవనరుల వినియోగంపై ఆయనకు ఉన్న దూరదృష్టి నేటికీ ప్రాసంగికమేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మోరిగాడి రమేష్,ఘనగాని మల్లేష్, వడ్డేమాన్ బాలరాజు,తాళ్లపల్లి గణేష్,మోరిగాడి అజయ్,కాసుల నరేష్,మహిళా సంఘం నాయకురాలు మోరిగాడి భాగ్యలక్ష్మి,మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు ఇంతియాజ్ ఇర్ఫానా,డీవైఎఫ్‌ఐ నాయకులు వడ్డేమాన్ విప్లవ్, యాసారపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



