Wednesday, April 29, 2026
E-PAPER
Homeజాతీయంనేడు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు

నేడు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు

- Advertisement -

– రెండోదశలో 142 స్థానాలకు పోలింగ్‌
– ఓటరు చేతిలో 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం
– మే 4న తుది ఫలితాలు
కోల్‌కతా :
పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోదశ పోలింగ్‌ జరగనున్నది. ఏడు జిల్లాల పరిధిలోని 142 నియోజకవర్గాల్లో ఉన్న సుమారు 3.21 కోట్ల మంది ఓటర్లు 1,448 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. మొదటి దశ పోలింగ్‌లో 90 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదై రికార్డు సృష్టించింది.
మోహరించిన కేంద్రబలగాలు
ఈ మేరకు ఎన్నికల సంఘం(ఈసీ) విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఏడు జిల్లాల్లో కలిపి 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించి ంది. కోల్‌కతాలో బలగాల మోహరింపు అధికంగా ఉంది. ఇక్కడ 273 కంపెనీల బలగాలు మోహరించాయి. మొత్తం 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించారు.
ఓటర్ల పరంగా చూస్తే..
రెండో విడతలో భాగంగా మొత్తం 3.21 కోట్ల మంది ఓటర్లలో.. 1.64 కోట్ల మంది పురుషులు, 1.57 కోట్ల మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. భౌగోళిక విస్తీర్ణం పరంగా ఎన్నికలకు వెళ్తున్న నియోజకవర్గాల్లో అత్యంత చిన్నది కోల్‌కతాలోని జోరాసంకో కాగా, అత్యంత పెద్దది నదియాలోని కళ్యాణి. ఓటర్ల సంఖ్య పరంగా అత్యంత చిన్న నియోజకవర్గం భాట్‌పారా (1,17,195 మంది ఓటర్లు) కాగా, అత్యంత పెద్దది చుంచురా (2,75,715 మంది ఓటర్లు). రెండవ దశలో ఎన్నికలకు వెళ్తున్న 142 స్థానాలు ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో ఉత్తర 24 పరగణాలు (33 స్థానాలు), దక్షిణ 24 పరగణాలు (31), నదియా (17), హౌరా (16) కోల్‌కతా (11), హుగ్లీ (18), పుర్బా బర్ధమాన్‌ (16)లు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -