దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులకు జైలా?
మా ఫోన్లను ట్యాప్‌చేస్తున్న అధికారులు రిటైర్ అయినా వదలం
రైతులు ఎండకు ఎండుతున్నా పట్టించుకోరేం..? : మాజీ మంత్రి హరీశ్‌రావు
సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న క్రిశాంక్‌కు పరామర్శ
నవతెలంగాణ-కంది
ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లతో అణచివేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు.. మాటలు బంద్‌జేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తోపాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను మంగళవారం హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్‌ను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపే అన్నారు. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి రెండు బాధ్యతలూ మీరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ప్రశ్నించే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటేనే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని అన్నారు.
అంగన్వాడీల ఫోన్ల కొనుగోలులో కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం.. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినం దుకే మన్నె క్రిశాంక్‌పై వరుసగా కేసులు పెట్టారని అన్నారు. క్రిశాంక్‌ను జైల్లో పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి వికృత ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఆయనపై అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని, మళ్లీ పిటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ”మా ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఐపీఎస్ అధికారులకు ఇదే మా హెచ్చరిక. మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి.చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఆ అధికారులకు మేము అధికారంలోకొచ్చాక తగిన బుద్ధి చెబుతాం.. చట్టానికి లోబడి పనిచేయండి..” అని సూచించారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రయివేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి తమ ఫోన్లు, ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.
చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను.. రేపు రిటైర్డ్ అయినాసరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ”మీ పార్టీ కార్యాలయం వేదికగా జరిగే అవినీతి, అక్రమాల వ్యవహారాలన్నీ రికార్డు అవుతున్నాయి.. రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ.. నీ పాలనలో సగం కాలం పూర్తయింది.. మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయండి” అని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్‌రెడ్డి వంద కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తారో లేదో సీఎం తేల్చాలన్నారు. ఐదారు కిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని మక్కలకు కొత్త షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 13 లక్షల ఎకరాల్లో పంట వేస్తే కనీసం సగం కూడా కొనలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎండలో రైతులు మాడిపోతుంటే పట్టించుకునే నాధుడే లేడని, రైతుల కష్టాలు పట్టవా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.



