త్వరలో ‘టీఎంఆర్‌ఎస్ బ్యూరో, టీ-సేఫ్’ నూతన సంస్థల ఏర్పాటు
సైబర్ నేరాలతో రూ.1,750 కోట్ల నష్టం
వరంగల్ జ్ఞాపకాలు మరిచిపోలేనివి : డీజీపీ సీవీ ఆనంద్
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పోలీస్‌శాఖ ప్రస్తుతం సంస్కరణల దశలో ఉందని, త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో (టీఎంఆర్‌ఎస్)తో పాటు ఫుడ్ అడల్టరేషన్ అండ్ డ్రగ్స్ కంట్రోల్‌ను రెండింటినీ కలిపి టి-సేఫ్ అనే సంస్థను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లా జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ)లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబాలతోనూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్యూరోలకు ఇప్పటికే మంజూరైన పోస్టులను బదిలీ చేయనున్నట్టు తెలిపారు. మావోయిజం పూర్తిస్థాయిలో నిర్మూలమైన క్రమంలో గ్రేహౌండ్స్ తదితర విభాగాల్లోని సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేసే విభాగాలకు బదిలీ చేయనున్నట్టు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా సమీక్షను ముగించామని, ఇప్పుడు వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాలను సమీక్షిస్తున్నట్టు చెప్పారు. పోలీస్ అమరవీరుల కుటుంబాల కోసం టీజీ వీర్ అనే యాప్‌ను ప్రారంభిం చామని అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాల్లో ఎలాంటి సమస్యలున్నా యాప్‌లో నమోదు చేస్తే పరిష్కరిస్తామని వివరించారు. గతేడాదిలో ప్రజలు దొంగతనాలతో రూ.250 కోట్లు పోగొట్టుకుంటే, సైబర్ క్రైమ్‌తో రూ.1,750 కోట్లు పోగొట్టుకున్నారని తెలిపారు. అధికంగా వ్యాపార వర్గాలే నష్టపోతున్నాయని అన్నారు. ప్రస్తుతం మాదకద్రవ్యాల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ‘ఈగల్’, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్థిక నేరాలను లోతుగా సమీక్షించడానికి జిల్లా పర్యటనలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాలపై వరంగల్‌లోనూ సమీక్ష నిర్వహించామని, అన్ని విషయా ల్లో వరంగల్ పోలీసు కమిషనరేట్ ముందంజలో ఉందని తెలిపారు.
వరంగల్‌లోనే నా ఐపీఎస్ ప్రస్థానం
వరంగల్‌లోనే తన ఐపీఎస్ ప్రస్థానం ప్రారంభమైందని, తొలుత వరంగల్ రూరల్ ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారని, వరంగల్‌లో నాటి జ్ఞాపకాలను ఎన్నటికీ మరిచిపోలేనని డీజీపీ సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. అప్పటి వరంగల్ పరిస్థితికి, నేటి పరిస్థితికి కాలక్రమంలో చాలా మార్పులొచ్చాయని తెలిపారు. నాడు గౌతమ్ సవాంగ్, సుధీప్ లక్టాకియా వంటి అధికారుల ఆధ్వర్యంలో పని చేసినట్టు చెప్పారు. నాడు ప్రతి గ్రామంలో పదిమంది మిలిటెంట్లు ఉండేవారని తెలిపారు. క్లేమోర్‌మైన్స్, ల్యాండ్ మైన్స్ బ్లాస్టింగ్‌లుండేవని, బయటకు వెళితే తిరిగి వస్తామో లేదోనన్న భయాందోళన ఉండేదని గుర్తు చేశారు. ఇప్ప్పుడు అగ్ర మావోయిస్టు నేతలు లొంగిపోవడంతో మావోయిజం పూర్తిస్థాయిలో నిర్మూలనైనట్టు చెప్పారు. వరంగల్ సీపీ ఇంటిని పరిశీలించానని, నాడు తాను హంటర్ రోడ్డులో ఒక ఇంట్లో ఉండేవాడినని, ఆ ఇంటిని కూడా సందర్శిస్తానన్నారు. సోమవారం ములుగు జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులతో సమావేశం ఉందని, అందులో వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఈగల్ ఫోర్స్ సీఐడీ ఎస్పీ రేపేష్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌శాఖలో సంస్కరణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



