ఐపీఎస్‌ఈఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐపీఎస్‌ఈఎఫ్) నిర్ణయించింది. ఢిల్లీలో ఆదివారం ఆ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ కార్యదర్శి ప్రేమ్‌చంద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు కె సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించారు. ఈ విధానాలను సమావేశం తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తక్షణమే నూతన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని అమలు చేయాలనీ, ఎన్పీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కటకం రమేష్ డిమాండ్ చేశారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి సర్వీస్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంతోపాటు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అంగన్‌వాడీ ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఈ డిమాండ్ల సాధన దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై త్వరలో ఉద్యమ కార్యాచరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



