Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగిన మిల్లులు.. కార్మికుల ఆకలి కేకలు

ఆగిన మిల్లులు.. కార్మికుల ఆకలి కేకలు

- Advertisement -

​యాసంగి ధాన్యానికి రా రైస్‌ గండం
రా రైస్‌ ఇస్తే క్వింటాకు 
20 కిలోల వరకు నష్టం
‘బాయిల్డ్‌’కే మొగ్గు 
చూపుతున్న మిల్లర్లు
ససేమిరా అంటున్న ఎఫ్ సీఐ
9 రోజులుగా రైస్‌మిల్‌ ఇండస్ట్రీ సమ్మె
వలస కూలీలంతా పనుల్లేక పయనం

నవతెలంగాణ – 
కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​రాష్ట్రంలో రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ తీవ్ర ఆర్థిక, నిర్వహణ సంక్షోభంలో కూరుకు పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిబంధనలు, క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉన్న ఆదేశాలు, రూ. వేల కోట్ల బకాయిల పెండింగ్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌ మిల్లర్లు సమ్మె బాట పట్టారు. ఈ నెల 11నుంచి ప్రారంభమైన రైస్‌ మిల్లుల బంద్‌ నేటికి 9వ రోజుకు చేరుకుంది. మిల్లుల మూతతో పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు, హమాలీలు, యంత్ర ఆపరేటర్లు, డ్రైవర్ల ఉపాధి పూర్తిగా దెబ్బతింది. ప్రధానంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు పని లేక, పూట గడిచే దారి లేక సొంతూళ్లకు తిరుగుముఖం పట్టారు. ​ప్రస్తుత సంక్షో భానికి ప్రధాన కారణం యాసంగి(రబీ) సీజన్‌లో పండిన ధాన్యం స్వభావమే. ప్రభుత్వం నిర్దేశించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) నిబంధనల ప్రకారం క్వింటా ధాన్యానికి 67 కిలోల ‘రా’ బియ్యం (67శాతం) పక్కాగా అప్పగించాలని ఆదేశించింది. ధాన్యాన్ని బాయిల్డ్‌ చేసి మిల్లింగ్‌ చేస్తే 67 కిలోల రికవరీ సాధించడం సాధ్యమవుతుంది. కానీ ‘రా’ రైస్‌‌గా మరాడిస్తే వేసవి తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య పండే యాసంగి ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండి ధాన్యపు గింజలు పొడిగా మారుతాయి. క్వింటాకు 45 నుంచి 50 కిలోల బియ్యం మాత్రమే వస్తోంది. మిగిలిన 17 నుంచి 22 కిలోల వ్యత్యా సాన్ని సొంతంగా భరించడం మిల్లర్లకు సాధ్యపడటం లేదు. గడిచిన 40 రోజులుగా ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ బియ్యాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తూ, కేవలం ‘రా’ రైస్‌ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేయడంతో సంక్షోభం ముదిరింది.

​పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
తెలంగాణ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 450 నుంచి 500కి పైగా క్రియాశీలక రైస్‌ మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా పరిధిలోని మిల్లుల్లోనే సుమారు 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యాసంగి ధాన్యం, మరో లక్ష మెట్రిక్‌ టన్నుల వానాకాలం ధాన్యం నిల్వలు నిలిచిపోయాయి. అక్టోబరు 31 నాటికి ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉన్నప్పటికీ, ‘రా’ రైస్‌ నిబంధనల వల్ల మిల్లింగ్‌ పూర్తయిన 20 వేల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ బియ్యం గోదాములకు చేరక మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. మరోవైపు సార్టెక్స్‌, గ్రేడర్లు, ఎఫ్‌ఆర్‌కే బ్లెండింగ్‌ నిబంధనల వల్ల మిల్లులకు 450 హెచ్‌పీ నుంచి 600 హెచ్‌పీ విద్యుత్‌ సామర్థ్యం అవసరమవుతోంది. కరెంట్‌ చార్జీలు నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్‌ చార్జీలు మాత్రం దశాబ్దాల కిందట నాటివే కావడం మిల్లర్లను నష్టాల్లోకి నెట్టింది. గోదాముల్లో స్థలం లేకపోవడంతో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి మిల్లర్లకు చెల్లించాల్సిన మిల్లింగ్‌, డ్రాయేజ్‌, కస్టోడియన్‌, ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇలా అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా రూ.9వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

​రోడ్డున పడిన కార్మికులు
‘రా’ రైస్‌ మిల్లుల కంటే బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లోనే ఎక్కువ సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. బాయిలింగ్‌, డ్రైయింగ్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వంటి ప్రక్రియలకు పెద్దఎత్తున కార్మికులు అవసరమవుతారు. వీరిలో మెజారిటీ కార్మికులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి పొట్టచేతపట్టుకుని వచ్చిన వారే. హమాలీలకు బస్తాలు ఎత్తి, దించితేనే కూలి లభిస్తుంది. తొమ్మిది రోజులుగా మిల్లులు మూతపడటంతో నిత్య కూలి నిలిచిపోయి, తిండికి కష్టమై వీరు మూటాముల్లె సర్దుకుని స్వగ్రామాలకు పయనమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని సుమారు 500 మిల్లుల్లో మిల్లుకు కనీసం 20మంది చొప్పున లెక్కవేసుకున్నా.. 10వేల మంది ఉపాధికి దూరమయ్యారు.

​బాయిల్డ్‌ బియ్యానికి అనుమతించాలి గీట్ల ముకుందర్‌ రెడ్డి, సీఐటీయూ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి
​యాసంగి ధాన్యం రా రైస్‌ చేస్తే 40 శాతానికి పైగా నూకలు వచ్చి మిల్లర్లతో పాటు మొత్తం రంగానికే నష్టం వాటిల్లుతుంది. ఎఫ్‌సీఐ కఠిన నిబంధనల వల్ల మిల్లులు మూతపడి హమాలీలు, ఆపరేటర్లు, వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. బీహార్‌, యూపీ, మహారాష్ట్ర నుంచి వచ్చిన కార్మికులు పనుల్లేక తిరుగు పయనమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బాయిల్డ్‌ బియ్యం సేకరణకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలి. రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమను ఆదుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -