ఆడుదాం..ఆసియా

Let's play..Asia– నేటి నుంచి 19వ ఆసియా క్రీడలు
నవతెలంగాణ-హౌంగ్జౌ
45 దేశాలు, 40 క్రీడాంశాలు, 12500కి పైగా క్రీడాకారులు.. ఆసియా క్రీడల మహా సంగ్రామానికి రంగం సిద్ధం. చైనాలోని హౌంగ్జౌ నగరం వేదికగా 19వ ఆసియా క్రీడలు నేటి నుంచి అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఆసియా ఖండంలోని 45 దేశాలు పాల్గొంటున్న ప్రతిష్టాత్మక కాంటినెంటల్‌ ఈవెంట్‌.. ఒలింపిక్స్‌ తర్వాత అతిపెద్ద మల్టీస్పోర్ట్స్‌ ఈవెంట్‌. హౌంగ్జౌ గేమ్స్‌లో పతకాల సెంచరీపై గురి పెట్టిన భారత్‌.. 655 మందితో కూడిన జంబో జట్టు 39 క్రీడాంశాల్లో పతక వేటకు బరిలోకి దిగుతోంది. నేడు సాయంత్రం 5.30 గంటలకు ఆరంభ వేడుకలు షురూ కానుండగా.. హాకీ ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ లవ్లీనా బొర్గొహైన్‌లు భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ఆరంభ వేడుకలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, కంబోరియా రాజు సింహమోని, సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌, హాంగ్‌ కాంగ్‌ నేత జాన్‌ లీ, దక్షిణ కొరియా ప్రధానమంత్రి హన్‌ డక్‌ సూ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సైతం ఆరంభ వేడుకలకు రానున్నారు.
క్రీడాశాఖ మంత్రి చైనా పర్యటన రద్దు : ఆసియా క్రీడల్లో పోటీపడే భారత వుషూ జట్టులోని అరుణాచల్‌ ప్రదేశ్‌ అథ్లెట్లను చైనా నిరాకరించింది. భారత అథ్లెట్లుగా అరుణాచల్‌ ప్రదేశ్‌ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పోటీపడటాన్ని చైనా అనుమతించలేదు. ఆసియా క్రీడల స్ఫూర్తికి విఘాతం కలిగించేలా డ్రాగన్‌ దేశం వ్యవహరించటంతో భారత క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చైనా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆసియా క్రీడల ఆరంభ వేడుకలకు హాజరు కావాల్సిన ఠాకూర్‌.. నిరసనగా హౌంగ్జౌకు వెళ్లటం లేదని అధికారులు తెలిపారు. 19వ ఆసియా క్రీడలు అక్టోబర్‌ 8న ముగింపు వేడుకలతో ముగియనున్నాయి.

Spread the love