హౌంగ్జౌలో తెలంగాణ ముద్ర!

Telangana Mudra in Hangzhou!–  ఆసియా క్రీడల పతక రేసులో మనోళ్లు
–  శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట.. మన అథ్లెట్ల ఉత్తమ ప్రదర్శనకు 2022 హౌంగ్జౌ ఆసియా క్రీడలు చక్కటి వేదిక. ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది పాలనలో అద్వితీయ ప్రోత్సాహం అందించగా, ఇప్పుడు కాంటినెంటల్‌ పోటీల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు మన అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. నేటి నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానుండగా.. హౌంగ్జౌ గేమ్స్‌కు తెలంగాణ అథ్లెట్ల సన్నద్ధత, పతక అవకాశాలపై ఆయన మాట్లాడారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌
 ఆసియా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల అవకాశాలు ఎలా ఉన్నాయి?
19వ ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్ర స్పష్టంగా కనిపించనుంది. తెలంగాణ నుంచి 16 మందితో కూడిన బృందం హౌంగ్జౌ క్రీడా గ్రామానికి వెళ్లనుంది. పతక వేటలో నిలిచేది 13 మంది అథ్లెట్లే అయినా.. మనోళ్లు అందరూ పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌, ఆకుల శ్రీజ, వృతి అగర్వాల్‌, అగసార నందినిలు తెలంగాణ గర్వపడే ప్రదర్శన చేస్తారనే విశ్వాసం ఉంది. కామన్‌వెల్త్‌ క్రీడల్లో పతకాల పంట పండించిన జోరు, ఉత్సాహమే ఆసియా క్రీడల్లోనూ మన అథ్లెట్లు కొనసాగిస్తారని అనుకుంటున్నాను.
 అథ్లెట్లను హౌంగ్జౌ క్రీడలకు ఏ విధంగా సన్నద్ధం చేశారు?
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అసమాన ప్రోత్సాహం అందిస్తుంది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు అవసరైన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సహజంగా ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య శిక్షణ శిబిరాలు, ప్రత్యేక ట్రైనింగ్‌ అందజేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్‌ నుంచి సైతం క్రీడాకారులకు సహకారం అందించాం.
కీడాకారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటీ?
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో అథ్లెట్లకు రూ. కోట్ల నగదు ప్రోత్సాహకాలు, విలువైన ఇంటి స్థలాలు, అకాడమీలకు అవసరమైన భూమి అందించాం. సింధు, అరుణా రెడ్డి, నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌, సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్‌, సాక్షి మాలిక్‌, మిథాలీ రాజ్‌, ప్రవీణ్‌ ఉప్పల, నందిత వీర్లపల్లిలు రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్‌ నుంచి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు సైతం ఆకర్షణీయ నగదు బహుమతులు అందజేస్తాం.
 తెలంగాణ నుంచి ఎక్కువగా మహిళా అథ్లెట్లే ఉన్నారు?
ఆసియా క్రీడల్లో పోటీపడుతున్న 14 మంది తెలంగాణ అథ్లెట్లలో 11 మంది అమ్మాయిలే. తెలంగాణ నారీ శక్తికి ఇది తిరుగులేని నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తుంది. ఆ విధానాల ప్రతిఫలాలు ఇప్పుడు క్రీడా రంగంలోనూ చూస్తున్నాం. తెలంగాణ అథ్లెట్లు మన రాష్ట్రానికి మాత్రమే కాదు యావత్‌ దేశానికి సైతం గర్వ కారణం. తాజా ఆసియా క్రీడల్లోనూ మన అమ్మాయిలే పసిడి వేటలో ముందంజలో ఉన్నారు.
 ప్రపంచ శ్రేణి అథ్లెట్ల తయారీలో శాట్స్‌ పాత్ర?
గత ఆరు నెలల సమయంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) బృహత్తర కార్యక్రమాలు చేపట్టింది. సీఎం కప్‌, ట్రైక్రీడా ఉత్సవాలు, క్రీడా యువ సమ్మేళనాలు సహా చలో మైదాన్‌ కార్యక్రమాలు చేపట్టాం. ఈ క్రీడా పోటీల్లో పోటీపడిన క్రీడాకారులు భవిష్యత్‌లో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించగలరు. ఓ వైపు ప్రపంచ శ్రేణి అథ్లెట్ల పురోగతికి సహకారం అందిస్తూనే, మరోవైపు వరల్డ్‌ క్లాస్‌ అథ్లెట్లను తయారు చేయటంపై దృష్టి సారించాం. తెలంగాణ గ్రామీణ క్రీడాకారుల సత్తా రానున్న జాతీయ క్రీడల్లో ప్రస్ఫుటం కానుంది.

Spread the love