– భారత్, ఆసీస్ తొలి వన్డే నేడు
– అశ్విన్, సుందర్ మాయ మెప్పించేనా?
– మధ్యాహ్నాం 1.30 నుంచి జియో సినిమాలో..
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు 15 రోజుల కౌంట్‌డౌన్ సైతం మొదలైంది. టైటిల్ రేసులో నిలిచిన అగ్రజట్లు మరోసారి వేట సన్నద్ధతను బేరీజు వేసుకునే పనిలో ఉన్నాయి. అందులో భాగంగానే మాజీ చాంపియన్లు భారత్, ఆస్ట్రేలియా మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఢకొీట్టనున్నాయి. టీమ్ ఇండియా ఆసియా కప్ విజేతగా నిలిచిన ఉత్సాహంలో ఉండగా.. సఫారీతో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం నుంచి 2-3తో సిరీస్ కోల్పోయిన స్థితి నుంచి కంగారూలు భారత్‌లో అడుగుపెట్టారు. ప్రపంచకప్ తుది సన్నద్ధతలో భారత్ బెంచ్ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టగా.. ఆసీస్ వరల్డ్‌కప్ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే నేడు.
నవతెలంగాణ-మొహాలి
భారత్, ఆస్ట్రేలియా ఆఖరు సన్నాహానికి సిద్ధమయ్యాయి. అక్టోబర్ 8న చెపాక్‌లో ముఖాముఖి పోరుతో టైటిల్ వేట షురూ చేయనున్న మాజీ చాంపియన్లు.. అంతకుముందు వారం రోజుల వ్యవధిలో మూడు వన్డేల్లో మెరుపు సమరానికి సై అంటున్నారు. ఇరు జట్లను గాయాల బెడద వేధిస్తుండగా, ఇరు జట్లు ఈ సిరీస్‌లో తుది జట్టు కూర్పు సహా ప్రత్యామ్నాయ వనరుల అన్వేషణ లక్ష్యంగా బరిలో నిలుస్తున్నాయి. అగ్ర జట్లు పోటీపడుతున్న సిరీస్‌లో వరల్డ్‌కప్ ముంగిట.. రక్తికట్టించే మ్యాచులు లాంఛనమే!. భారత్, ఆస్ట్రేలియా చివరగా తలపడిన సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ డకౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ సైతం కంగారూలతో సిరీస్‌లో సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు.
మాయ మెప్పించేనా?! : రవిచంద్రన్ అశ్విన్ చివరగా 2022 జనవరిలో వన్డే మ్యాచ్‌లో కనిపించాడు. ప్రపంచకప్ ప్రణాళికల్లో లేని ట్రంప్‌కార్డ్ ఆఫ్ స్పిన్నర్ ఆఖరు క్షణాల్లో జట్టు మేనేజ్‌మెంట్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో మెగా ఈవెంట్‌లో అవసరం అవుతాడనే అంచనాతో అశ్విన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌నూ ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. ప్రపంచకప్ జట్టులో మణికట్టు స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. ఆఫ్ స్పిన్నర్‌కు చోటు దక్కలేదు. దీంతో ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌ను ఈ సిరీస్‌లో పరీక్షించనున్నారు. నాణ్యమైన కంగారూ బ్యాటింగ్ లైనప్‌ను అశ్విన్, వాషింగ్టన్ స్పిన్ జోడీ మాయలో పడేయగలిగితే.. ప్రపంచకప్ జట్టులోకి ఏ క్షణంలోనైనా అడుగుపెట్టే దీమా దక్కించుకున్నట్టే!. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్‌లు తొలి రెండు వన్డేలకు దూరమయ్యారు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ సహా ఇషాన్ కిషన్‌లకు మరింత బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ సైతం మిడిల్ ఆర్డర్‌లో చోటు కోసం పోటీపడుతున్నాడు. కానీ అయ్యర్, సూర్యలకు తొలి ప్రాధాన్యత కనిపిస్తుంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ నాయకత్వంతో పాటు వ్యక్తిగత ప్రదర్శనతోనూ సత్తా చాటాల్సి ఉంది. పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్, షమిలు బరిలోకి దిగుతున్నారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ఏకంగా ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు తుది జట్టులో నిలువనున్నారు.
ప్రణాళికలు మొదలు! : ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ప్రణాళికలు ఈ సిరీస్ నుంచే ఆరంభం కానున్నాయి. ప్రపంచకప్ జట్టులో కంగారూలు స్టీవ్ స్మిత్, మార్నస్ లుబుషేన్‌కు చోటు కల్పించారు. టెస్టు జట్టులో ఈ ఇద్దరు గొప్ప బ్యాటర్లు. కానీ ధనాధన్ ఫార్మాట్‌గా మారిన వన్డేల్లో స్మిత్, లబుషేన్‌కు చోటు కల్పించటం సాహాసమే అవుతుంది. మిడిల్ ఆర్డర్‌లో ఈ ఇద్దరితో ఎలా ముందుకు సాగాలనే అంశంలో ఆసీస్ నేడు భారత్‌తో తొలి వన్డేలో ప్రయోగం చేయనుంది. గ్లెన్ మాక్స్‌వెల్, ఆష్టన్ ఆగర్, ట్రావిశ్ హెడ్, మిచెల్ స్టార్క్‌లు అందుబాటులో లేరు. దీంతో స్మిత్, లబుషేన్ తుది జట్టులో నిలువనున్నారు. డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు ఓపెనర్లుగా రానుండగా.. అలెక్స్ కేరీ, కామరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్‌లు లోయర్ మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోనున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ పేస్ దళాన్ని నడిపించనుండగా.. తన్వీర్ సంగా, జోశ్ హాజిల్‌వుడ్, స్టోయినిస్‌లు సారథితో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పిచ్, వాతావరణం : మొహాలి గత నాలుగేండ్లుగా వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. కానీ ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారత దేశవాళీ సీజన్‌కు సైతం ఇది మరీ ముందు!. అయినా, పిచ్ పెద్దగా మారే అవకాశం కనిపించటం లేదు. మ్యాచ్ రోజు ఎటువంటి వర్షం సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా, జోశ్ హజిల్‌వుడ్.