బుమ్రా బూమ్‌బూమ్‌

– రీ ఎంట్రీలో తొలి ఓవర్లోనే అదుర్స్‌
– రాణించిన ప్రసిద్‌, బిష్ణోరు
– ఐర్లాండ్‌ స్కోరు 139/7
నవతెలంగాణ-డబ్లిన్‌
వెన్నునొప్పి గాయంతో జాతీయ జట్టుకు దూరమైన పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా.. పునరాగమనంలో అదరగొట్టాడు. శస్త్రచికిత్స, ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌ అనంతరం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. తొలి ఓవర్లోనే నిప్పులు చెరిగాడు. తనదైన మార్క్‌ బంతులతో ఐర్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన జశ్‌ప్రీత్‌ బుమ్రా.. రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. మరో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ, స్పిన్నర్‌ రవి బిష్ణోరు సైతం రెండేసి వికెట్లు పడగొట్టడంతో తొలి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బారీ మెక్‌కార్టీ (51 నాటౌట్‌, 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కర్టీస్‌ కాంపెర్‌ (39, 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఐర్లాండ్‌కు మంచి స్కోరు అందించారు.
బుమ్రా జోరు : టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనాన్ని కొత్త బంతితో చాటాడు. తొలి బంతికి బౌండరీ కోల్పోయినా.. ఆ తర్వాత ఆండీ బల్‌బిర్నె (4), లార్కాన్‌ టక్కర్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా కండ్లుచెదిరే బంతులతో ఆకట్టుకున్నాడు. మరో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ సైతం మెరవటంతో ఐర్లాండ్‌ కష్టాల్లో కూరుకుంది. పాల్‌ స్టిర్లింగ్‌ (11), హ్యారీ టెక్టర్‌ (9), జార్జ్‌ డాక్‌రెల్‌ (1)లను స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. దీంతో ఐర్లాండ్‌ 59 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆతిథ్య జట్టు వంద పరుగులు చేసినా అద్భుతమే అనిపించింది. కానీ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ కర్టీస్‌ కాంపెర్‌ (39), బారీ మెక్‌కార్టీ (51 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. మెక్‌కార్టీ చివరి ఓవర్లో అర్షదీప్‌ సింగ్‌పై రెండు సిక్సర్లు, ఓ బౌండరీ సంధించాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 33 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరి మెరుపులతో ఐర్లాండ్‌ తొలుత 139 పరుగులు సాధించింది. మార్క్‌ ఎడెర్‌ (16) చివర్లో ఆకట్టుకున్నాడు.
ఇక ఛేదనలో భారత్‌ పవర్‌ప్లేలో (6 ఓవర్లు) ఆకట్టుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ వికెట్‌ నష్టపోకుండా తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. రెండో ఇన్నింగ్స్‌కు వర్షం ముప్పు ఉండటంతో డక్‌వర్త్‌ లూయిస్‌ సమీకరణాలు ఉత్కంఠ రేపే అవకాశం ఉంది!.

Spread the love