మనోళ్లు మెరిసేనా?

– నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌
– భారత్‌ నుంచి బరిలో
– 27 మంది అథ్లెట్లు బుదాపెస్ట్‌ (హంగరీ)

భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ స్టార్‌ అథ్లెట్లు ప్రపంచ సవాల్‌కు సిద్ధమయ్యారు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఒకే పతకం సాధించిన టీమ్‌ ఇండియా.. ఈ సారి బుదాపెస్ట్‌లో ఆ సంఖ్యను పెంచాలనే పట్టుదలతో కనిపిస్తుంది. 2023 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ హంగరీలోని బుదాపెస్ట్‌లో నేటి నుంచి ఆరంభం కానుండగా.. భారత్‌ నుంచి 27 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఈ ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ చూపించి, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కనీసం టాప్‌-8లో నిలువగల సత్తా కలిగిన అథ్లెట్లను మాత్రమే ఈసారి పోటీలకు పంపుతున్నారు. దీంతో ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రాకు తోడు మరికొందరు బుదాపెస్ట్‌ నుంచి పతకాలతో స్వదేశానికి వస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 19 నుంచి 27 వరకు ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగుతాయి.
టార్గెట్‌ 90మీ : భారత సూపర్‌స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా. ఒలింపిక్స్‌, ఆసియా, కామన్‌వెల్త్‌, డైమండ్‌ లీగ్‌ చాంపియన్‌గా కొనసాగుతున్న 25 ఏండ్ల నీరజ్‌ చోప్రా.. కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకునేందుకు చెమటోడ్చుతున్నాడు. అసమాన విజయాలు నీరజ్‌ ఖాతాలో ఉన్నప్పటికీ.. అతడు ఇంకా 90 మీటర్లకు దూరంగానే ఉండిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌ ఫైనల్స్‌ ముంగిట తుది ప్రాక్టీస్‌ సెషన్లో నీరజ్‌ చోప్రా 90 మీటర్లకు పైగా బల్లెంను విసిరాడని కోచ్‌ బార్టినేజ్‌ తెలిపినా.. ఆ సమయంలో ఎటువంటి కెమెరా లేదు. జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 86.48 మీటర్లతో పసిడి సాధించిన నీరజ్‌.. 2018 ఆసియా గేమ్స్‌లో 88.07 మీ, టోక్యో ఒలింపిక్స్‌లో 87.88 మీటర్లతో చారిత్రక పసిడి, డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్లు సంధించాడు. నిరుడు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 88.39 మీటర్ల త్రోతో సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. ఇటీవల డైమండ్‌ లీగ్‌లో 90 మీటర్లకు అత్యంత చేరువగా వచ్చినా.. తృటిలో 89.94 మీటర్ల వద్ద ఆగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల దాటేందుకు సిద్ధమవుతున్న నీరజ్‌ చోప్రా.. ఈసారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచేందుకు సైతం రంగం సిద్ధం చేసుకున్నాడు.
నీరజ్‌ చోప్రాతో పాటు ఈసారి పతక రేసులో మరికొందరు అథ్లెట్లు సైతం నిలిచారు. స్టీపుల్‌ఛేజర్‌ అవినాశ్‌ సబ్లె అంచనాల మేరకు రాణిస్తే మెడల్‌ పోడియంపై నిలువటం లాంఛనమే. లాంగ్‌ జంపర్‌ శ్రీశంకర్‌, జెస్విన్‌, ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌లు పతక వేటలో ఫేవరేట్లుగా నిలిచారు. ఇక తెలుగు తేజం జ్యోతి ఎర్రాజి తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడుతుంది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి ఎర్రాజి పతకంపై కన్నేసింది.

Spread the love