ఇషా సింగ్‌ పసిడి గురి

– శివతో కలిసి మిక్స్‌డ్‌ పసిడి సొంతం
– ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌
బాకు (అజర్‌బైజాన్‌)
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాదీ గన్‌ ఘనంగా పేలింది. హైదరాబాదీ స్టార్‌ షూటర్‌ ఇషా సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో శివ నర్వాల్‌తో కలిసి అదరగొట్టిన ఇషా సింగ్‌.. స్వర్ణ పతకం అందుకుంది. పసిడి షూటౌట్‌లో టర్కీ జోడీ టర్హాన్‌, యూసుఫ్‌లపై 16-10తో పైచేయి సాధించిన ఇషా సింగ్‌, శివ నర్వాల్‌లు ప్రపంచ చాంపియన్లుగా అవతరించారు. 65 జోడీలు పోటీపడిన మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో 583/600 పాయింట్లతో అర్హత రౌండ్‌లో ఇషా, శివలు అగ్రస్థానంలో నిలిచారు. తొలి రోజు పోటీల్లో జట్టు విభాగంలో కాంస్యం సాధించిన శివ నర్వాల్‌కు పోటీల్లో ఇది రెండో పతకం కావటం విశేషం. భారత్‌ నుంచి పోటీపడిన మరో జోడీ దివ్య టిఎస్‌, సరబ్‌జ్యోత్‌ సింగ్‌లు 574 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచింది. మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మెహూలీ ఘోష్‌, ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌లు 630.2 స్కోరుతో పతక పోరుకు 1.2 పాయింట్ల దూరంలో నిలిచారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌, శివ నర్వాల్‌కు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజేయ గౌడ్‌ అభినందనలు తెలిపారు.

Spread the love