ఆసియా కిరీటం ఎవరిదో?

Crown of Asia whose–  ఆసియా కప్‌ టైటిల్‌ పోరు నేడు
– రికార్డు ఎనిమిదో టైటిల్‌ భారత్‌ గురి
– ఆత్మవిశ్వాసంతో డిఫెండింగ్‌ చాంప్‌ శ్రీలంక
– మధ్యాహ్నాం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
వరల్డ్‌కప్‌ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన టోర్నీ ఆసియా కప్‌. ఏడు సార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియా… కాంటినెంటల్‌ టోర్నీపై తిరుగులేని ముద్ర వేసింది. కానీ 2018 ఆసియా కప్‌ అనంతరం భారత జట్టు మరో మల్టీ టీమ్‌ టోర్నీలో విజేతగా నిలువలేదు. ఆధునిక క్రికెట్‌ అగ్రజట్టుగా కొనసాగు తున్నా.. మల్టీ టీమ్‌ టోర్నీ టైటిల్‌ లోటు సుస్పష్టం. స్వదేశంలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ వేటకు సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియా.. తొలుత ఆసియా కిరీటం దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక సైతం సొంతగడ్డపై అద్భుతంతో మళ్లీ టైటిల్‌ పట్టేయాలనే పట్టుదల ప్రదర్శిస్తోంది. ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, శ్రీలంక ఢ నేడు.
కాంటినెంటల్‌ కిరీటం వేటకు భారత్‌, శ్రీలంక అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకునేందుకు భారత్‌ ఎదురు చూస్తుండగా, ఏడో టైటిల్‌తో భారత్‌ సరసన నిలిచేందుకు శ్రీలంక తహతహ లాడుతోంది. ఆర్థిక సంక్షోభం నడుమ గత ఆసియా కప్‌ను గెలుపొందిన శ్రీలంక.. ద్వీప దేశంలో ప్రజలకు ఆనందం అందించింది. ఇప్పుడూ స్వదేశంలోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని శనక సేన భావి స్తోంది. కానీ, రోహిత్‌సేన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. గత ఐదేండ్లలో తొలి మల్టీ టీమ్‌ ఈవెంట్‌ విజయంతో వన్డే వరల్డ్‌కప్‌ వేటకు సిద్ధ మవ్వాలని భారత్‌ ప్రణాళిక. బలాబలాల పరంగా భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ప్పటికీ.. డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక అవకాశాలను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
గట్టిగా కొట్టాలని..!
జట్టుపై ఎన్నో ప్రశ్నలు, అనుమానాలతో ఆసియా కప్‌కు వచ్చిన భారత్‌.. ఫైనల్‌ పోరుకు ముందే డ్రెస్సింగ్‌రూమ్‌లో, విమర్శకులలో సానుకూల వాతావరణం తీసుకొచ్చింది. బ్యాటింగ్‌ లైనప్‌లో ప్రతి బ్యాటర్‌ ఏదో ఒక మ్యాచ్‌లో ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడారు. బౌలింగ్‌ విభాగంలోనూ ఇదే తీరు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు మంచి ఆరంభాలు అందిస్తున్నారు. విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ పాకిస్థాన్‌పై శతక మోత మోగించగా.. ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యలు గ్రూప్‌ దశ మ్యాచుల్లోనే సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చారు. బౌలింగ్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లు కొత్త బంతితో బ్రేక్‌ అందిస్తున్నారు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్రత్యర్థులకు సింహాస్వప్నంగా మారాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బంతితో ఫర్వాలేదనిపించినా.. బ్యాట్‌తో తనదైన జోరు చూపించాల్సి ఉంది. నేడు శ్రీలంకతో ఆసియా కప్‌ ఫైనల్లో జడేజా మ్యాజిక్‌ చేస్తాడేమో చూడాలి.
నమ్మకమే జయం!
నమ్మకమే జయమని డిఫెండింగ్‌ చాంపి యన్‌ శ్రీలంక నమ్ముతుంది. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి గత ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. ఇప్పుడు టైటిల్‌ ఫేవరేట్‌ భారత్‌తో ఫైనల్లోనూ అదే నమ్మకంతో బరిలోకి దిగుతోంది. సూపర్‌ 4 మ్యాచ్‌లో టీమ్‌ ఇండియాపై ఓ దశలో తిరుగులేని పైచేయి సాధించిన లంకేయులు.. బ్యాటర్ల వైఫల్యంతో వెనక్కి తగ్గారు. టైటిల్‌ పోరులో అదే స్ఫూర్తితో పోరాడేందుకు శనక గ్యాంగ్‌ సిద్ధమైంది. నం.3 బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌ వెన్నుముక. ఐదు మ్యాచుల్లో అతడు 253 పరుగులు చేశాడు. పాక్‌పై 91, బంగ్లాపై 50, అఫ్గాన్‌పై 92 పరుగులు నమోదు చేశాడు. భారత్‌పై ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఆసియా కప్‌ను దిగ్విజయంగా ముగించాలని మెండిస్‌ భావిస్తున్నాడు. మెండిస్‌కు పెరీరా, నిశాంక, అసలంకలు తోడైతే శ్రీలంక ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంది. పేసర్‌ మతీశ పతిరణ నేడు భారత బ్యాటర్లకు సవాల్‌ విసిరేందుకు సిద్ధంగా ఉన్నాడు. శనక, డిసిల్వ, వెల్లలాగే, హేమంత, రజితలు సైతం సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు.
గాయాల దెబ్బ
ఆసియా కప్‌ ఫైనల్స్‌ ముంగిట భారత్‌, శ్రీలంకకు గాయాల దెబ్బ. టీమ్‌ ఇండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ నేడు టైటిల్‌ పోరుకు దూరమయ్యారు. తొడ కండరాల నొప్పితోనే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఛేదనకు దిగిన అక్షర్‌ పటేల్‌..నేడు ఫైనల్‌కు అందుబాటులో లేడు. దీంతో మరో యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ హుటాహుటిన బెంగళూర్‌ నుంచి కొలంబో చేరుకున్నాడు. పిచ్‌, పరిస్థితులను బేరీజు వేసి అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఈ ఏడాది వన్డేల్లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, మహీశ్‌ తీక్షణ. జనవరి నుంచి ఇద్దరూ వన్డేల్లో 31 వికెట్లు పడగొట్టారు. చైనామన్‌ స్పిన్నర్‌ ఫైనల్లో భారత్‌కు కీలకం కానుండగా.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మహీశ్‌ తీక్షణ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. దీంతో ఇటు భారత్‌కు, అటు శ్రీలంకకు గాయాల దెబ్బ సమంగా తగిలింది!.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
శ్రీలంక : కుశాల్‌ పెరీరా, పథుం నిశాంక, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్‌ శనక (కెప్టెన్‌), దునిత్‌ వెల్లలాగే, దుశాన్‌ హేమంత, మతీశ పతిరణ, కసున్‌ రజిత.
వరుణ గండం?!
ఆసియా కప్‌ను వరుణుడు వీడటం లేదు. గ్రూప్‌ దశ నుంచీ మొదలైన వర్షం ఆటంకం సూపర్‌ 4 మ్యాచుల్లోనూ కొన సాగింది. చివరగా ఆసియా కప్‌ ఫైనల్స్‌లోనూ వర్షం ముప్పు పొంచి ఉంది. భారత్‌, శ్రీలంక టైటిల్‌ పోరులో ఢకొీట్ట నుండగా..ఆదివారం మ్యాచ్‌ సమయంలో 60-80 శాతం మేర వర్షం కురిసేందుకు అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. రిజర్వ్‌ డే (సోమవారం) సైతం వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సోమ వారం సైతం సుమారు 80 శాతం వరకు వర్షం కురువ నుందని తెలుస్తుంది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు ఓ కన్ను ఆటపై.. మరో కన్ను ఆకాశంపై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది!.
స్పిన్‌ సవాల్‌
ఆసియా కప్‌ ఫైనల్‌ స్పిన్‌ వార్‌గా మారింది!. కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఆరు మ్యాచులు జరిగాయి. దీంతో పిచ్‌లు ఎంతగానో నెమ్మదించాయి. పేసర్లకు పెద్దగా సహకారం దక్కటం లేదు. కానీ వరుణుడు సైతం ప్రతి మ్యాచ్‌కు రావటంతో.. పిచ్‌ నుంచి పేసర్లకు కాసింత సహకారం అందింది. ఫైనల్లోనూ ఇదే పరిస్థితి కనిపించనుంది. భారత్‌, శ్రీలంక సూపర్‌4 మ్యాచ్‌లో రోహిత్‌సేన పది వికెట్లు స్పిన్నర్లకే కోల్పోయింది. అందులో పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ వార్‌లో భారత్‌కు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా ఉండగా.. శ్రీలంకకు ఇప్పుడు యువ మాయగాడు దునిత్‌ వెల్లలాగే ఒక్కడే ఉన్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ ధనంజయ డిసిల్వ ఆశించిన ప్రభావం చూపించటం లేదు.

Spread the love