తిలక్‌ వర్మ వచ్చాడు

– వన్డే జట్టులోకి మనోడు అడుగు
– 17 మందితో ఆసియా కప్‌ జట్టు
– ప్రకటించిన చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌
తెలుగు తేజం, హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ ప్రతిభకు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ పట్టం కట్టింది. కరీబియన్‌ గడ్డపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ.. రానున్న ప్రపంచకప్‌లో ‘యువరాజు’ పాత్ర పోషించగలడని జట్టు మేనేజ్‌మెంట్‌ సైతం భావించటంతో..
ఒక్క వన్డే ఆడకుండానే తిలక్‌ వర్మ నేరుగా ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. మరో రెండు వారాల్లో 15 మందితో కూడిన ప్రపంచకప్‌ జట్టును ప్రకటించనున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
క్రికెట్‌ పండితులు, అభిమానుల అంచనాలు నిజమయ్యాయి. భారత జట్టులో యువ ‘యువరాజ్‌ సింగ్‌’గా పేరొందిన తెలుగు తేజం తిలక్‌ వర్మ ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. మిడిల్‌ ఆర్డర్‌లో కీలక నం.4 బ్యాటర్‌గా నిలకడగా పరుగులు రాబట్టడం, బ్యాటింగ్‌ లైనప్‌లో కుడి-ఎడమ కాంబినేషన్‌ను తీసుకురావటం సహా నాణ్యమైన పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా తిలక్‌ వర్మ వన్డే జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు. దీంతో ఆగస్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌లో పోటీపడే భారత జట్టులోకి తిలక్‌ వర్మను సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. సోమవారం న్యూఢిల్లీలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ.. 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అనంతర చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగర్కార్‌తో కలిసి భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఆ నలుగురు ఇన్‌
గాయాలతో ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న నలుగురు క్రికెటర్లు సైతం వన్డే జట్టుకు ఎంపికయ్యారు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా, పేసర్‌ ప్రసిద్‌ కృష్ణలు ఐర్లాండ్‌తో టీ20ల్లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ చాటుకోగా.. బెంగళూర్‌లోని ఎన్‌సీఏ ప్రాక్టీస్‌ గేముల్లో కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెప్పించారు. దీంతో ఈ నలుగురు క్రికెటర్లను నేరుగా జట్టులోకి తీసుకున్నారు. కెఎల్‌ రాహుల్‌ తొడ కండరాల గాయం నుంచి కోలుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్నునొప్పి నుంచి బయటపడ్డాడు. కెఎల్‌ రాహుల్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఫినీషర్‌ పాత్రకు తోడు వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌ కీలక నం.4 బ్యాటర్‌గా బ్యాటింగ్‌ విభాగంలో కీలకం కానున్నాడు. పేస్‌ విభాగంలో బుమ్రా, ప్రసిద్‌లకు తోడు మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌లు చోటు దక్కించుకున్నారు. పేస్‌ ఆల్‌రౌండర్లుగా హార్దిక్‌ పాండ్య, శార్దుల్‌ ఠాకూర్‌లో జట్టులో నిలిచారు.
చాహల్‌ అవుట్‌
లెగ్‌స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌పై వేటు పడింది. ఫింగర్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లకు తోడు మణికట్టు మాయగాడు, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు చోటు దక్కింది. ఇటీవల కరీబియన్‌ పర్యటనలో కుల్దీప్‌ యాదవ్‌ విశేషంగా రాణించాడు. జట్టులో ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు ఉండగా.. ఆఫ్‌ స్పిన్నర్‌కు చోటు లభించలేదు. రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు సెలక్షన్‌ కమిటీ విశ్వాసం పొందలేకపోయారు. ఇక రెండో వికెట్‌ కీపర్‌ బెర్త్‌ కోసం సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లు పోటీపడగా.. సెలక్షన్‌ కమిటీ సంజు శాంసన్‌ను పక్కనపెట్టింది. టాప్‌ ఆర్డర్‌లో, వికెట్‌ కీపింగ్‌లో ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ కిషన్‌ జట్టులో నిలిచాడు. అయినప్పటికీ.. రిజర్వ్‌ ఆటగాడి కోటాలో సంజు శాంసన్‌ ఆసియా కప్‌కు జట్టుతో పాటే వెళ్లనున్నాడు.
ఏ స్థానంలోనైనా ఆడాలి
భారత జట్టులో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాం. ఏ ఆటగాడైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓ స్థానం ఎంచుకుని అక్కడే ఆడతానంటే కుదరదు. జట్టులోని ఎనిమిది బ్యాటింగ్‌ పొజిషన్లు ఓపెన్‌గా ఉన్నాయి. గత 3-4 ఏండ్లుగా జట్టుకు అందించిన సందేశం ఇదే. ఎనిమిది స్థానాల్లో ఉత్తమ బ్యాటర్లను ప్రయోగించి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే లక్ష్యం. ఇక జట్టులో ఆఫ్‌ స్పిన్నర్‌ను ఆడించటంపై చర్చ జరిగింది. చాహల్‌ను తప్పించటం వెనుక పెద్ద కారణం ఏం లేదు. ప్రపంచకప్‌ జట్టు ఎంపిక సమయంలో ఎవరైనా జట్టులోకి రావచ్చు. అశ్విన్‌, వాషింగ్టన్‌ సహా చాహల్‌ అవకాశాలు ఇక్కడితో ముగిసిపోలేదని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు.
బెంగళూర్‌లో క్యాంప్‌
ఆసియా కప్‌ ఆగస్టు 30న ఆరంభం కానుండగా.. భారత్‌ సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. 18 (రిజర్వ్‌తో కలిపి) ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆరు రోజుల పాటు బెంగళూర్‌లోని ఎన్‌సీఏలో శిక్షణ శిబిరంలో పాల్గొంటుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు సైతం ఈ క్యాంప్‌కు రానున్నారు. ఆసియా కప్‌ కోసం భారత జట్టు ఇక్కడి నుంచే కొలంబోకు బయల్దేరి వెళ్లనుంది. శిక్షణ శిబిరంలో భాగంగా భారత జట్టు అంతర్గత ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడేందుకు అవకాశం ఉంది. ఇందులో యువ క్రికెటర్లను ప్రధానంగా పరీక్షించనున్నారు.
శాట్స్‌ చైర్మెన్‌ అభినందనలు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు క్రికెటర్లు ఆసియా కప్‌ జట్టులో చోటు సాధించటం పట్ల శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.’ భారత జట్టుకు ఎంపికైన మహ్మద్‌ సిరాజ్‌, తిలక్‌ వర్మలకు అభినందనలు. ఆసియా కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి భారత విజయంలో తెలంగాణ క్రికెటర్లు ముఖ్య పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను’అని ఆంజనేయ గౌడ్‌ అభినందనలు తెలిపారు.
ఆటతో పాటు టెంపర్‌మెంట్‌ కలిగిన నమ్మకమైన ఆటగాడిని కరీబియన్‌ పర్యటనలో చూశాం. ఆ ప్రదర్శనతో అతడిని ఆసియా కప్‌ జట్టులోకి తీసుకున్నాం. ప్రతిభావంతుడు, లెఫ్ట్‌ హ్యాండర్‌ను పరీక్షించేందుకు కెప్టెన్‌, కోచ్‌కు సైతం ఓ అవకాశం. ఆసియా కప్‌ను 17 మందిని ఎంపిక చేసే వెసులుబాటు ఉంది. కానీ ప్రపంచకప్‌కు 15 మందినే ఎంపిక చేస్తాం. అప్పటివరకు జట్టు సైతం ఓ అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు ఎంచుకున్న జట్టుతోనే దాదాపుగా ప్రపంచకప్‌ ఎంపిక జరుగుతుంది.
– తిలక్‌ వర్మ ఎంపికపై చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌
ఆసియా కప్‌కు భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శార్దుల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్‌ కృష్ణ.
(రిజర్వ్‌ ప్లేయర్‌ : సంజు శాంసన్‌).

Spread the love