షెడ్యూల్‌లో మార్పుల్లేవ్‌

– హెచ్‌సీఏతో బీసీసీఐ ఉన్నతాధికారులు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవు. మెగా ఈవెంట్‌కు మరో 44 రోజులే ఉండగా.. ఈ సమయంలో షెడ్యూల్‌లో మార్పులు చేయలేమని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)తో బీసీసీఐ ఉన్నతాధికారులు తెలిపారు. తొమ్మిది మ్యాచుల రీ షెడ్యూల్‌లో భాగంగా అక్టోబర్‌ 9, 10న వరుస రోజుల్లో హైదరాబాద్‌కు మ్యాచులు కేటాయించారు. అక్టోబర్‌ 9న న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌ తలపడనుండగా.. మరుసటి రోజు పాకిస్థాన్‌, శ్రీలంక పోటీపడనున్నాయి. నాలుగు జట్లకు ప్రాక్టీస్‌, హోటల్‌ సహా స్టేడియం వద్ద వరుసగా రెండు రోజులు భద్రత కల్పించటంపై హైదరాబాద్‌ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో వరుస మ్యాచులకు భద్రత కల్పిస్తామని హైదరాబాద్‌ పోలీసులు హెచ్‌సీఏకు తెలిపినట్టు సమాచారం. అక్టోబర్‌ 9న ఉప్పల్‌ స్టేడియంలో కివీస్‌, డచ్‌ మ్యాచ్‌ ఉండటంతో.. పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల ప్రాక్టీస్‌ సెషన్‌ను జింఖానా మైదానంలోనే ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. అక్టోబర్‌ 6న పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ ఉప్పల్‌లో తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. తర్వాతి మ్యాచుల కోసం ఇరు జట్లు ఇక్కడే ఉండనున్నాయి. న్యూజిలాండ్‌ అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్‌ ఆడి మరుసటి రోజు హైదరాబాద్‌కు రానుంది. శ్రీలంక అక్టోబర్‌ 7న న్యూఢిల్లీలో డే నైట్‌ మ్యాచ్‌ ముగించుకుని మరుసటి రోజు హైదరాబాద్‌కు చేరుకోనుంది. వరుస రోజుల్లో వరుస మ్యాచులతో ఏకంగా నాలుగు జట్లకు సుమారు వారం రోజుల పాటు భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్‌ 9, 10న వరుస మ్యాచులను స్థానిక అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని విజయవంతం చేసేందుకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా హైదరాబాద్‌లో ఉండనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. వన్డే వరల్డ్‌కప్‌లో హైదరాబాద్‌ మూడు మ్యాచులకు వేదిక కానుంది.

Spread the love