వరుస మ్యాచులు వద్దు!

No consecutive matches!– బీసీసీఐతో హెచ్‌ఏసీ అధికారులు
– ప్రపంచకప్‌ షెడ్యూల్‌ మార్చాలని వినతి
సలే ఆలస్యంగా షెడ్యూల్‌ విడుదల. ఆపై ఏకంగా తొమ్మిది మ్యాచుల షెడ్యూల్‌లో మార్పులు. అభిమానులకు టికెట్లు మరో నాలుగు రోజుల్లో అందుబాటులోకి రానున్న తరుణంలో.. షెడ్యూల్‌లో మార్పులు కోరుతూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధికారులు బీసీసీఐ తలుపు తట్టారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచుల నిర్వహణ కష్టసాధ్యమని బోర్డుకు హెచ్‌సీఏ తేల్చిచెప్పింది!.
నవతెలంగాణ-హైదరాబాద్‌
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 50 రోజుల కౌంట్‌డౌన్‌ సైతం మొదలైనా.. షెడ్యూల్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అహ్మదాబాద్‌, కోల్‌కత పోలీసులు పండుగ రోజుల్లో క్రికెట్‌ మ్యాచులకు భద్రత కల్పించటంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఇటీవల బీసీసీఐ, ఐసీసీ తొమ్మిది మ్యాచులను రీ షెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే. రీ షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచులను కేటాయించారు. దీంతో ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ మ్యాచులకు వరుస రోజుల్లో భద్రత కల్పించటం కత్తి మీద సామేనని హైదరాబాద్‌ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో షెడ్యూల్‌ తుది మార్పులు చేయాల్సిందిగా హెచ్‌సీఏ ఉన్నతాధికారులు బీసీసీఐకి విన్నవించారు.
డబుల్‌ రిస్క్‌!
సాధారణంగా ప్రపంచకప్‌ మ్యాచులకు కనీసం 3000 మంది పోలీసులను మొహరిస్తారు. పైగా పాకిస్థాన్‌ జట్టు హైదరాబాద్‌ వేదికగా వార్మప్‌, రెండు ప్రధాన మ్యాచులు ఆడనుంది. దీంతో స్టేడియంతో పాటు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు బస చేసే హోటల్‌ వద్ద భారీగా భద్రతా దళాలు మొహరించాల్సి ఉంటుంది. ఇటువంటి సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో.. వరుసగా రెండు రోజులు రెండు మ్యాచులకు భద్రత కల్పించటం ఇబ్బందికరమని హైదరాబాద్‌ పోలీసులు హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లారు. రీ షెడ్యూల్‌లో భాగంగా అక్టోబర్‌ 9, 10న హైదరాబాద్‌లో ప్రపంచకప్‌ మ్యాచులు ఉన్నాయి. అక్టోబర్‌ 9న న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ ఉండగా.. అక్టోబర్‌ 10న పాకిస్థాన్‌, శ్రీలంక మ్యాచ్‌ జరుగుతుంది. భద్రతా పరంగా ఎటువంటి రిస్క్‌ తీసుకోలేమని హైదరాబాద్‌ పోలీసులు స్పష్టం చేయటంతో.. హెచ్‌సీఏ ఉన్నతాధికారులు బీసీసీఐకి విషయాన్ని తెలియజేశారు.
‘ అక్టోబర్‌ 9, 10న వరుస రోజుల్లో రెండు మ్యాచుల నిర్వహణపై అభ్యంతరాలను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాం. షెడ్యూల్‌ మార్పులు, హెచ్‌సీఏ ఇబ్బందులను పరిశీలిస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఇంత తక్కువ టైమ్‌లో షెడ్యూల్‌ మార్పు కుదరకపోవచ్చనే సంకేతాలు సైతం ఇచ్చారు. బీసీసీఐ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం’ అని హెచ్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు.
అభిమానుల ఆగ్రహం
ప్రపంచకప్‌ షెడ్యూల్‌ రూపకల్పనలో బీసీసీఐ అలసత్వం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు కార్యదర్శి జై షాను సోషల్‌ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. కీలక ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ఖరారు చేసే ముందు స్థానిక క్రికెట్‌ సంఘాలు, పోలీసులు, ప్రభుత్వంతో కనీసం చర్చించరా? ఇలా ప్రతిసారి అభ్యంతరాలు రాగానే ఎన్ని సార్లు షెడ్యూల్‌ను మార్చుతారు? అంటూ ఫ్యాన్‌ ఫైర్‌ అవుతున్నారు. మరో 45 రోజుల్లో ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఇప్పుడు షెడ్యూల్‌లో మార్పులు చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఓవరాల్‌గా ప్రపంచకప్‌ షెడ్యూల్‌నే ఓ జోక్‌ చేశారంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

Spread the love