డబ్ల్యూఎఫ్‌ఐపై వేటు

డబ్ల్యూఎఫ్‌ఐపై వేటు– సకాలంలో ఎన్నికల నిర్వహణలో విఫలం
– సస్పెన్షన్‌ విధించిన యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై వేటు పడింది. సకాలంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించటంలో విఫలం కావటంతో.. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యూడబ్ల్యూ) కఠిన చర్యలు తీసుకుంది. 45 రోజుల గడువులోగా అడ్‌ హాక్‌ కమిటీ ఎన్నికలు నిర్వహించలేకపోయింది. సస్పెన్షన్‌తో రానున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు ‘తటస్థ రెజ్లర్లు’గా పోటీపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఊహించనదే జరిగింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వివాదం ముదిరి పాకాన పడింది. మహిళా రెజ్లర్లపై బిజెపి ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని రెజ్లింగ్‌ సమాజం వెలుగులోకి తీసుకురావటంతో మొదలైన వివాదం.. ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికలపై.. ప్రపంచ రెజ్లింగ్‌ సంఘం (యుడబ్ల్యూడబ్ల్యూ) 45 రోజుల గడువు ఇచ్చింది. కానీ ఎన్నికల ప్రక్రియపై వరుసగా న్యాయస్థానాలు నిలుపుదల ఆదేశాలు జారీ చేయటంతో.. నిర్దేశిత గడువులోగా ఎన్నికలు జరుగలేదు. ఈ పరిణామంతో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ కఠిన చర్యలు తీసుకుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ విధిస్తూ భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ), భారత క్రీడామంత్రిత్వ శాఖ, భారత రెజ్లింగ్‌ సమాఖ్యలకు లేఖలు పంపించింది!.
తటస్థ అథ్లెట్లుగానే : యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సస్పెన్షన్‌ నిర్ణయం భారత రెజ్లింగ్‌ క్రీడాకారులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రపంచ క్రీడా వేదికలపై క్రీడాకారులకు అత్యున్నత స్ఫూర్తి జాతీయ జెండాతోనే. కానీ భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు పడటంతో.. మన రెజ్లర్లు మువ్వన్నెల జెండాతో పోటీ పడలేరు. ఈవెంట్‌లో భారత క్రీడాకారులుగా పోటీపడలేరు. పతకం సాధించినా భారత జాతీయ జెండాను మెడల్‌ పోడియంపై ఎగురవేయరు. పసిడి నెగ్గినా.. భారత జాతీయ గేయం మెడల్‌ పోడియంపై వినిపించదు. ఇటీవల ముగిసిన ప్రపంచ అండర్‌-20 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. రెజ్లింగ్‌ చరిత్రలోనే భారత జట్టు ఇలా టీమ్‌ టైటిల్‌ నెగ్గటం ఇదే తొలిసారి. కానీ తటస్థ రెజ్లర్లుగా ఎన్ని విజయాలు సాధించినా.. అవి భారత ఖాతాలో చేర్చరు. ఈ పరిణామం కచ్చితంగా భారత రెజ్లర్లపై ప్రతికూల ప్రభావం చూపనుంది. అయితే, రానున్న 2023 ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్లు జాతీయ జెండాతోనే పోటీపడనున్నారు. ఈ క్రీడలకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అథ్లెట్ల జాబితాను పంపిస్తుంది. కానీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య జాబితాను పంపించాల్సి ఉంటుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు పడటంతో.. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించిన మల్లయోధులను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ నేరుగా పోటీలకు తీసుకుంటుంది.
వరుస అడ్డంకులు! : భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలను జులై 11న నిర్వహించేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తొలుత నిర్ణయించారు. కానీ అస్సాం రెజ్లింగ్‌ సంఘం తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో జూన్‌ 25న ఎన్నికలపై స్టే విధిస్తూ గువహటి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది. దీంతో తొలిసారి డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు నిలిచిపోయాయి. గువహటి హైకోర్టు నిలుపుదల ఆదేశాలను ఆంధ్ర రెజ్లింగ్‌ సంఘం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీంతో జులై 18న గువహటి హైకోర్డు ఆదేశాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగా ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆగస్టు 12న ఎలక్షన్స్‌కు నిర్ణయించారు. కానీ దీపిందర్‌ సింగ్‌ హుడా సారథ్యంలోని హర్యానా రెజ్లింగ్‌ సంఘం (హెచ్‌డబ్ల్యూఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హర్యానా, పంజాబ్‌ హైకోర్టు.. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆగస్టు 11 ఆదేశించింది. దీంతో ఒక్క రోజు ముందు ఎన్నికలు మరోసారి నిలిచిపోయాయి. హర్యానా రెజ్లింగ్‌ సంఘానికి కాకుండా.. హర్యానా అమేచర్‌ రెజ్లింగ్‌ సంఘానికి ఓటు హక్కు కల్పించడాన్ని దీపిందర్‌ సింగ్‌ హుడా సవాల్‌ చేశారు. ఇక ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ నేడు (శుక్రవారం) బెంచ్‌కు ముందుకు రానుంది.
ముందే హెచ్చరించినా.. : సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో సస్పెన్షన్‌ వేటు వేస్తామని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ముందే హెచ్చరించింది. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల కేసు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌.. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన ఆసియా జూనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌ వేదికను మార్పు చేసింది. మహిళా అథ్లెట్లకు న్యాయం చేయాలని కోరుతూనే.. ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఇచ్చింది. రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు, రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అడ్‌హాక్‌ కమిటీని నియమించింది. అడ్‌హాక్‌ కమిటీ చీఫ్‌ భూపేందర్‌ సింగ్‌ బజ్వా ఏకపక్ష నిర్ణయాలతో సస్పెన్షన్‌ వరకు తీసుకొచ్చారని కమిటీలోని ఇతర సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక నేడు,రేపు పాటియాలలో జరగాల్సిన ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ షెడ్యూల్‌ ప్రకారం సాగుతాయని అడ్‌హాక్‌ కమిటీ వెల్లడించింది.

Spread the love