కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె మరింత ఉధృతం

– కాంట్రాక్ట్‌ ఉద్యోగులెవరూ అప్లికేషన్లు పెట్టుకోవద్దు
– ప్రభుత్వ దిగొచ్చే వరకు ఉద్యమం
– టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె మరింత ఉధృతం చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) నిర్ణయించింది. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో 20 జిల్లాల నుంచి వచ్చిన ఏఎన్‌ఎంలతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులెవరూ ఆన్‌లైన్‌ అప్లికేషన్లు పెట్టుకోవద్దని నిర్ణయించారు. ప్రభుత్వ దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు 10 రోజులుగా సమ్మె చేస్తున్న ఆయా జిల్లాలకు చెందిన వందలాది మంది కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు ఉదయం 7 గంటల నుంచి హైదరాబాద్‌లోని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నార్సింగి పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ మంత్రికి తమ సమస్యలు విన్నవించుకున్నాకే వెళ్తామని భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియొద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌, రాష్ట్ర కోశాధికారి ఎ.కవిత ఆధ్వర్యంలో 20 మంది సభ్యుల బృందాన్ని మంత్రి వద్దకు తీసుకెళ్లారు.
రెగ్యులర్‌ సాధ్యం కాదు -స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌ రావు
రెగ్యులర్‌ చేయడం సాధ్యం కాదు. పరీక్షా విధానం రద్దు చేయమని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. దీంతో ఏఎన్‌ఎంల ప్రతినిధులు మాట్లాడుతూ, 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన తాము మళ్లీ పరీక్ష రాయడం సాధ్యం కాదని వేడుకున్నారు. దీంతో మంత్రి మాట్లాడుతూ, సమ్మె, పోరాటం వల్లనే పోస్టుల సంఖ్య పెంచామనీ, వెయిటేజ్‌ మార్కులు 30కి పెంచామనీ, వయో పరిమితిని 53 ఏండ్లకు సడలించి, తెలుగులో పరీక్ష రాసుకునేందుకు కూడా అవకాశం కల్పించామని తెలిపారు.
ఏఎన్‌ఎంలు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ మంత్రి సానుకూలంగా స్పందించలేదు. ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామని లెక్కలు చెప్పారు. అనంతరం ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ, మంత్రి కనికరం చూపకుండా నిరంకుశంగా వ్యవహరించారనీ, 20 ఏండ్లుగా రూ.2 వేల జీతంతో మొదలై తాము జీవితాలనే త్యాగం చేసిన విషయాన్ని మరిచిపోయారని విచారం వ్యక్తం చేశారు.
మంత్రి దురుసు ప్రవర్తన
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావుకు, ఏఎన్‌ఎంల సమస్యలపై యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ వివరించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డు తగిలారని యూనియన్‌ నాయకులు తెలిపారు. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాలు చేయడానికొచ్చావా? మీరు రాజకీయ ప్రయోజనాల కోసం సమ్మె చేయిస్తున్నారు? బయటకు వెళ్లండి… అని దాదాపు గెంటేసినంత పని చేసి సీఐటీయూ నాయకత్వాన్ని తీవ్రంగా అవమానించారని తెలిపారు. అహంకారపూరితంగా మంత్రి నోరు పారేసుకున్నారంటూ ఆ చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఉద్యోగుల ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవనీ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, సమ్మెను పరిష్కరించాలనీ, అందరి ముందు మంత్రి అవమానించినా ఉద్యోగుల ప్రయోజనాల కోసమే భరిస్తున్నామని భూపాల్‌ మంత్రికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్‌ కుమార్‌ (ఆదిలాబాద్‌), జె.కుమారస్వామి, కిరణ్మయి, లక్ష్మీభాయి, అమ్మాజీ (హైదరాబాద్‌), సావిత్రి, విజయలక్ష్మి, నిర్మల్‌ సరస్వతి (ఆదిలాబాద్‌, గంగా జుమున, పుష్ప (నిజామాబాద్‌), నర్మద (వరంగల్‌), క్రిష్ణవేణి, సుగుణ, జ్యోతి, (నాగర్‌ కర్నూల్‌), అక్తర్‌ బేగం (మంచిర్యాల), కె.విజయలక్ష్మి (కొత్తగూడెం), రాజి (హనుమకొండ), వై.జమునా రాణి (ములుగు), నేహా (మహబూబ్‌ నగర్‌), చంద్రకళ (వనపర్తి), ఎం.రమాదేవి (కరీంనగర్‌), ప్రభావతి, జ్యోతి (వరంగల్‌), పుష్పలత (యాదాద్రి), వెంకటమ్మ (వికారాబాద్‌), సీఐటీయూ నాయకులు లింగాల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love