– వైద్యారోగ్య సంఘాల క్యవేదిక ప్రతినిధులతో న్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలోని అన్ని క్యాడర్ల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడు రోజుల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి శుభవార్త చెబుతాం… అని తెలంగాణ రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్‌డీ హామీ ఇచ్చినట్టు వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదిక తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారుల ఆహ్వానం మేరకు వారితో చర్చించినట్టు తెలిపారు. ఐక్యవేదిక ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని సమస్యలపై మంత్రితో వారు చర్చిస్తారనీ, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఆ వేదిక రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ కత్తి జనార్థన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యారోగ్యశాఖలోని అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి ఒక ప్రణాళికా ప్రకారం పోరాడితే సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని అభిప్రాయపడ్డారు. 20 ఏండ్లుగా విడివిడిగా ఉండి ఏమీ సాధించలేదన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. ఇప్పటికే ఐక్యవేదికలో 25 సంఘాలున్నాయనీ, మిగిలిన సంఘాలు కూడా బేషజాలకు పోకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని ఆహ్వానించారు.