– జహీరాబాద్ నుంచి భారీగా బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో హిందూ ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. టిఎస్‌ఐడిసీ చైర్మెన్, బీఆర్‌ఎస్ పార్టీ నేత మహమ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరిలో జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ మొయిస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్బర్, మాజీ కౌన్సిలర్ ఫక్రుద్దీన్ సహా దాదాపు 200 మంది వివిధ పార్టీలకు చెందిన ముస్లిం మైనారిటీ నేతలు ఉన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఉర్దూ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మైనారిటీల్లోని పేదలు, నిరుద్యోగులు సొంత వ్యాపారాల నిర్వహణ కోసం లక్ష రూపాయల ఉచిత గ్రాంటును అందచేయబోతున్నామని తెలిపారు.