– బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
– వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ – మెదక్
‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో మళ్లీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యమే..’ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఅర్ విజన్, పట్టుదల, మేధస్సుతో తెలంగాణలో దశల వారీగా అభివృద్ధి జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రెస్‌మీట్‌లు, సోషల్ మీడియాలో తప్ప ప్రజల్లో లేవన్నారు. కాంగ్రెస్‌లో పోటీ చేసేందుకు నాయకులు లేరు కాబట్టే అభ్యర్థుల సీట్లను అమ్ముకుంటున్నట్టు ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో ప్రజల ఇబ్బందులను అందరూ గమనిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకొని కుర్చీల కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమంపై యావ లేదని విమర్శించారు. బీజేపీ డిపాజిట్ల కోసం తండ్లాడే పరిస్థితితో ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. పోడు పట్టాలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పంచాయతీ సెక్రటేరీలు, వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో బీజేపీ, కాంగ్రెస్‌కు ఎజెండా అనేది లేకుండా బేజారై పోతున్నారని ఎద్దేవా చేశారు.