– పెనాల్టీతో గట్టెక్కిన ఛెత్రిసేన
హౌంగ్జౌ : ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు బోణీ కొట్టింది. మంగళవారం ఆతిథ్య చైనాతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో 0-5తో దారుణ పరాజయం చవిచూసిన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. చీఫ్ కోచ్ స్టిమాక్ స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రిని మైదానంలోకి పంపించేందుకు ఆసక్తి చూపలేదు. యువ ఆటగాళ్లను ప్రయోగించి సత్తా చాటాలనే తెగువ చూపించినా.. ఆఖరుకు కెప్టెనే వచ్చి పెనాల్టీ కిక్‌తో భారత్‌ను విజయాన్ని అందించాడు. 85వ నిమిషంలో బంగ్లాదేశ్ అందించిన పెనాల్టీని అలవోకగా గోల్‌గా మలిచిన సునీల్ ఛెత్రి భారత్‌ను 1-0తో ముందంజలో నిలిపాడు. ఆధిక్యం నిలుపుకున్న టీమ్ ఇండియా.. గ్రూప్ దశలో తొలి విజయం సాధించింది. మయన్మార్‌తో సమానంగా నిలిచిన భారత్.. గోల్స్ వ్యత్యాసంగా పరంగా వెనుకంజలో నిలిచింది. చైనా చేతిలో ఐదు గోల్స్ తేడాతో పరాజయం పాలవటం గ్రూప్ దశ దాటేందుకు అడ్డుగా మారుతోంది. బంగ్లాదేశ్‌తో విజయంతో భారత్ ఆశలు సజీవంగా నిలిచినా.. గ్రూప్‌లో ఇతర మ్యాచుల ఫలితాలపైనే భారత్ ముందంజ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి!.