ముగిసిన బ్యాడ్మింటన్‌ పోటీలు

Completed Badminton Competitions– 35వ సబ్‌ జూనియర్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌
నవతెలంగాణ, హైదరాబాద్‌ : 35వ జాతీయ సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ మంగళవారం హైదరాబాద్‌లోని గుత్తా జ్వాల అకాడవీలో ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్‌ 14న మొదలైన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పోటీపడ్డారు. మంగళవారం అన్ని విభాగాల్లో ఫైనల్స్‌ జరుగగా.. అండర్‌-15, అండర్‌-17 (బాలురు, బాలికలు) విభాగాల్లో విజేతలుగా నిలిచిన షట్లర్లకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం గుత్తా జ్వాల ట్రోఫీ, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ‘ హైదరాబాద్‌లో ఆధునాతన సదుపాయాలు, సౌకర్యాలతో అతిపెద్ద బ్యాడ్మింటన్‌ అకాడమీ నెలకొల్పి, వర్థమాన క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న గుత్తా జ్వాలకు అభినందనలు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహం అందిస్తుంది. టోర్నీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు’ అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. టోర్నీ ముగింపు కార్యక్రమంలో గుత్తా జ్వాల తండ్రి క్రాంతి గుత్తా, ఆదాయపన్ను కమిషనర్‌ రాజేంద్ర కుమార్‌, మహా సిమెంట్‌ చీఫ్‌ కర్ణాకర్‌ రావు సహా తదితరులు పాల్గొన్నారు.

Spread the love