– పాక్, కివీస్ వార్మప్‌పై కీలక నిర్ణయం
హైదరాబాద్ : పాకిస్థాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌కు అభిమానులకు ప్రవేశం ఉండబోదు!. ఇప్పటికే ఈ వార్మప్ మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు డబ్బు తిరిగి చెల్లించాలని బుక్‌మైషోకు బీసీసీఐ సూచించనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు. ఇటీవల రీ షెడ్యూల్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్‌ల తేదిలు సైతం మారాయి. సెప్టెంబర్ 28న గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగల భద్రత ఏర్పాట్లతో తీరిక లేకుండా గడుపనున్న పోలీసులకు.. ఆ మరుసటి రోజే పాక్, కివీస్ వార్మప్‌కు భద్రత కల్పించటం కష్టంగా మారింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఉన్నతాధికారులకు పోలీసులు తెలియజేశారు. అక్టోబర్ 9, 10న వరుసగా రెండు మ్యాచులకు భద్రత కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసిన హైదరాబాద్ పోలీసులు.. వార్మప్ మ్యాచ్‌కు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. పాక్, కివీస్ వార్మప్ మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు బీసీసీఐ రీఫండ్ చేయనుంది. దీంతో ఈ వార్మప్ అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియంలో జరుగనుంది. అక్టోబర్ 3న పాకిస్థాన్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ మాత్రం అభిమానుల నడుమ జరుగుతుంది.