Monday, August 10, 2026
E-PAPER
Homeజాతీయంఉమర్‌ ఖలీద్‌ పుస్తకంపై చర్చకు నో

ఉమర్‌ ఖలీద్‌ పుస్తకంపై చర్చకు నో

- Advertisement -

జేఎన్‌యూ అనుమతి నిరాకరణ
విద్యార్థి సంఘం ఆగ్రహం
​న్యూఢిల్లీ :
సామాజిక కార్యకర్త, మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ పుస్తకంపై చర్చ జరిపేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌‌యూ) అనుమతి నిరాకరించింది. ఉమర్ ఖలీద్ రచించిన ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్: ఆదివాసి హిస్టరీస్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ పవర్’ అనే పుస్తకంపై జరగాల్సిన చర్చా కార్యక్రమం కోసం ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేసినట్టు జేఎన్‌‌యూ తెలిపింది. ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ఎస్‌ఎస్‌ఎస్‌-1) ఆడిటోరియంలో ఈ చర్చా కార్యక్రమం జరగాల్సి వుంది. “కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోవడం వల్ల ఎస్‌ఎస్‌ఎస్‌-1 ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేశాం ’’ అని జేఎన్‌‌యూ ఆదివారం ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొంది. జేఎన్‌‌యూ ఒక “ప్రజాస్వామ్య మరియు వికేంద్రీకృత సంస్థ” అని, దీనికి సంబంధించిన అనుమతిని ఎస్‌ఎస్‌ఎస్‌ డీన్ మంజూరు చేశారని, ఆ తర్వాత ఆయనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారని విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రొఫెసర్‌ అవినాష్‌ కుమార్‌ అధ్యక్ష‍తన ప్రొఫెసర్ ప్రభు మహాపాత్ర, ప్రొఫెసర్ ఉమా చక్రవర్తి, శుద్ధబ్రత సేన్‌గుప్తా, హర్ష్ మందర్, బనోజ్యోత్స్న లహిరిలు ఈ పుస్తకంపై చర్చించనున్నట్టు ఈ కార్యక్రమ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఆడిటోరియం బుకింగ్ ఆగస్టు 7న ఖరారైంది. అయితే, కార్యక్రమానికి సంబంధించి ఏ వివరాలను వెల్లడించలేదనే విషయంపై జేఎన్‌‌యూ స్పష్టతనివ్వలేదు. మత సంస్థలు క్యాంపస్‌ను వినియోగించడం యూనివర్శిటీ నిబంధనలను ఉల్లంఘించడమేనని జేఎన్‌‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌‌యూఎస్‌యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో క్యాంపస్‌లో జరగాల్సిన ఇస్కాన్‌ కార్యక్రమాన్ని జేఎన్‌‌యూ రద్దు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈకార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

​జేఎన్‌‌యూ ఏకపక్ష‍, నిరంకుశ నిర్ణయాన్ని జేఎన్‌‌యూఎస్‌యూ ఖండించింది. యూనివర్శిటీ క్యాంపస్‌లో పుస్తకంపై చర్చించడం అనేది విద్యా సంస్కృతిలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక భాగమని జేఎన్‌‌యూ ఎస్‌యూ ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమానికి వేదికను రద్దు చేయడం ద్వారా, జేఎన్‌‌యూ యంత్రాంగం మరోసారి తన విద్యార్థి వ్యతిరేక, మేధో వ్యతిరేక ఎజెండాను బయటపెట్టిందని మండిపడింది. “బుకింగ్ సమయంలో పూర్తి వివరాలు ఇవ్వలేదు” అని జేఎన్‌‌యూ పేర్కొనడం కేవలం ఒక సాకు మాత్రమేనని, అసలు ఉద్దేశ్యం చర్చను అడ్డుకోవడమేనని ఆరోపించింది. ఇతర కార్యక్రమాలకు, ముఖ్యంగా ఇస్కాన్‌ కార్యక్రమాలకు యాజమాన్యం సహకరిస్తున్నప్పుడు, ఈ విద్యాపరమైన చర్చకు మాత్రం స్థలం నిరాకరించడం ద్వంద్వ ప్రమాణమని విమర్శించింది. “విద్యార్థుల కార్యక్రమాలకు నిబంధనలు, అర్హతలు అంటూ కఠినంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం, తన స్వంత ఫ్యాకల్టీ నియామకాల విషయంలో కూడా అదే నిబంధనలను కచ్చితంగా పాటించిందా? అని జేఎన్‌‌యూఎస్‌యూ నిలదీసింది. రిపోర్టర్స్ కలెక్టివ్ ప్రచురించిన, జర్నలిస్ట్ అలోక్ రాజ్‌పుత్ చేసిన ఒక ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ పదవీకాలంలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలలో జరిగిన అనేక ఫ్యాకల్టీ నియామకాలను ఆందోళనలను లేవనెత్తిన సంగతి తెలిసిందే. నియమితులైన వ్యక్తులు ఆ ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్న కనీస బోధనా అనుభవం, ప్రచురణల అర్హతలను అందుకోలేదని తేలిందని జేఎన్‌‌యూఎస్‌యూ పేర్కొంది. ఆదివాసీల జల్–జంగల్–జమీన్ పోరాటాలపై ఉన్న పుస్తకాన్ని చర్చించకుండా అడ్డుకోవడం విద్యా స్వేచ్ఛకు, చర్చా స్వేచ్ఛకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఆడిటోరియంను కేటాయించకపోయినా బహిరంగ ప్రదేశంలో చర్చను కొనసాగిస్తామని పేర్కొంది. తెలుసుకునే, ప్రశ్నించే , చర్చించే తమ హక్కును కాపాడుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -