బాలికపై సామూహిక లైంగికదాడి.. హత్య
కుళ్లిన స్థితిలో మృతదేహం.. శరీర భాగాలను పీక్కుతిన్న కుక్కలు
50కి పైగా సీసీటీవీ
కెమెరాల పరిశీలన.. నలుగురు నిందితుల అరెస్టు
బీజేపీ పాలనలో గాలిలో దీపంలా మహిళల భద్రత
న్యూఢిల్లీ :, హత్యకు సంబంధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ పరిధిలో స్వరూప్ నగర్ ప్రాంతంలో బాలిక మృతదేహం తీవ్రంగా ఛిద్రమైన స్థితిలో లభ్యమైంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 13 ఉదయం కుషక్ రోడ్డులోని జైపాల్ రాణా ఫామ్‌హౌస్ దగ్గర ఉన్న బహిరంగ ప్రదేశంలో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోవడంతో తొలుత మృతురాలి ఆడ, మగ అనేది కూడా నిర్ధారించలేక పోయినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహంలోని కొన్ని భాగా లను వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఒక చేయి శరీరం నుంచి విడిపోయి కనిపిం చింది. దీంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసు లకు కష్టంగా మారింది. క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 50కి పైగా సీసీటీవీ ఫుటేజీల పరిశీలన కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటనా స్థలం, పరిసర రహదారుల్లోని 50కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అదనపు డీసీపీ లోకేశ్ వారణ్ వివరాల ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో అనుమానాస్పద టెంపో ఒకటి ఆ ప్రాంతంలో సంచరిం చినట్టు ఫుటేజీల్లో గుర్తించారు. సెప్టెంబర్ 15 రాత్రి ఖడ్డా కాలనీలో టెంపోను గుర్తించిన పోలీసులు దాని డ్రైవర్‌ను విచారించారు. అనంతరం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసుల దర్యాప్తు వివరాలు వెల్లడించాయి.
లైంగికదాడి అనంతరం హత్య!
అరెస్టయిన నిందితులు తొలుత మద్యం సేవించారు. అనంతరం బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెను కత్తులతో పొడిచి హత్య చేశారు. పోలీసులు రెండు కత్తులు, నేరం జరిగిన సమయంలో నిందితులు ధరించిన దుస్తులు, టెంపోను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను దర్యాప్తులో కీలక ఆధారాలుగా పరిశీలిస్తున్నారు. మొదట మృతదేహాన్ని ఓ మహిళదిగా భావించినప్పటికీ.. తదుపరి దర్యాప్తులో మృతురాలు బాలిక అని నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోవడంతో గుర్తించడం ఇబ్బందిగా మారింది.
మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు
ఈ ఘటనతో ఢిల్లీలోని బీజేపీ పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటన మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ప్రశ్నలను మరోసారి ముందుకు తెస్తోంది. నేరం జరిగిన తర్వాత నిందితులను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా, ఇలాంటి ఘటనలను నివారించేందుకు సమర్థవంతమైన భద్రతా చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, బాధిత కుటుంబానికి న్యాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు అంటున్నాయి. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి ప్రకటించే హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.



