గతేడాది ప్రచారానికి మొత్తం రూ.108 కోట్లు తొమ్మిది రోజుల్లోనే రూ.14 కోట్లు ఖర్చు!
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రభుత్వ తీరిది
ప్రధాని జన్మదినం, పదవీకాల మైలురాళ్ల పేరుతో
ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు
మరోసారి తెరపైకి ఖర్చుల వివరాలు
ప్రధాని మోడీని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచార వేడుకలుగా మార్చుతున్నాయి బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిపై ఇప్పటికే దేశ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 17న ఆయన జన్మదిన వేడుకల నుంచి 25 ఏండ్ల ‘ప్రజా జీవితం’ అంటూ ప్రజాధనంతో భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దేశ ప్రజల కష్టాలు, బాధలు పట్టని బీజేపీ ప్రభుత్వాలు.. మోడీ జన్మదినం, ఆయన రాజకీయ జీవితంలో మైలురాయిని ఒక వేడుకల నిర్వహిస్తూ, ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం మోడీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలను ఆయనతో ముడిపెడుతూ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకు వందకోట్లకు పైగానే ఖర్చు చేసింది. ప్రస్తుతం బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో నెలపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ జన్మదినం మరోసారి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. మోడీ జన్మదినం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ కలిసి ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమ య్యాయి. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం ఈ కార్యక్రమాల కోసం ప్రతి డిప్యూటీ కమిషనర్‌కు రూ.10 లక్షలు కేటా యించింది. దీంతో గతంలో గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వార్షికోత్సవాల సందర్భాలను పురస్కరిం చుకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మోడీ ప్రచార వేడుకలకు ప్రజాధనం
ప్రధాని మోడీ జన్మదినం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని మైలురాళ్లను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్ర రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు, ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రకటనల ద్వారా ఈ వేడుకలను నెలపాటు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ అభియాన్–జనసేవే ప్రభుసేవ’ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 వరకు నిర్వహించనున్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నారు.
గుజరాత్లో తొమ్మిది రోజులకు రూ.14.05 కోట్లు
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టి 24 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది అక్టోబర్ 7 నుంచి 15 వరకు ‘వికాస్ సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి గుజరాత్ ప్రభుత్వం రూ.14.05 కోట్లు ఖర్చు చేసినట్టు ఓ ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది. 2024లో మోడీ ప్రజా జీవితంలో 23 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం నిర్వ హించిన ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలపై రూ.8.81 కోట్లు ఖర్చు చేసినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఈ మొత్తం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలకు ఖర్చయింది.
ప్రభుత్వ పథకాలకూ వ్యక్తిగత ప్రచార రంగు
గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం వెబ్సైట్ ప్రకారం.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 7 నుంచి 15 వరకు ‘వికాస్ సప్తాహ్’ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ పాలన, పథకాల అమలును ప్రజలకు వివరించడమే లక్ష్యమని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ కార్యక్రమాలు మోడీ రాజకీయ ప్రస్థానంతో ముడిపడి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, పన్ను సంస్కరణలు, పాలనా మైలురాళ్లను ఒక వ్యక్తి నాయకత్వ ప్రచారంగా మార్చడం వల్ల ప్రజాధనం వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జీఎస్టీ పొదుపు ఉత్సవానికీ కోట్ల ఖర్చు
జీఎస్టీ రేట్ల మార్పుల అనంతరం మోడీ నాయక త్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటనలు వెలువడ్డాయి. దీనికి కొనసాగింపుగా 2025 సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 28 వరకు ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ నిర్వహించారు. రాజ్యసభలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలకే రూ.22 కోట్లు ఖర్చు చేశారు. అంటే ప్రజలకు పన్ను ఆదా గురించి తెలియజేసే ప్రచారం కూడా ప్రజాధనంతోనే నిర్వహించ బడిందన్నమాట.
ఎన్నికల ఏడాది భారీగా పెరిగిన ఖర్చు
గుజరాత్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమాచార, ప్రసార శాఖ ప్రచారానికి రూ.305.37 కోట్లు ఖర్చు చేసింది. అదే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2021–22లో ఈ శాఖ రూ.163.43 కోట్లు ఖర్చు చేయగా, 2022–23లో ఖర్చు దాదాపు 87 శాతం పెరిగింది. 2022–23లో రోజువారీ సగటు ఖర్చు సుమారు రూ.83.66 లక్షలుగా నమోదైంది.
2025లో గుజరాత్ ప్రచారానికి రూ.108.80 కోట్లు
2025లో గుజరాత్ సమాచార, ప్రసార శాఖ ప్రచారానికి రూ.108.80 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాల కోసం వినియోగించినట్టు అసెంబ్లీ సమాధానంలో పేర్కొంది. ఇది రోజుకు సగటున సుమారు రూ.29.8 లక్షలు అన్నమాట. ఈ శాఖ గుజరాత్ ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంది. అయితే ప్రచారానికి ఎన్ని ఏజెన్సీలను ఎంపిక చేశారు, ఎన్ని ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ఏజెన్సీలకు చెల్లింపులు చేశారనే ప్రశ్నకు ప్రభుత్వం ‘సున్నా’ అని సమాధానం ఇవ్వడం గమనార్హం.
ప్రచారమా? ప్రజాసేవా?
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రచారం అవసరమే. అయితే రాజకీయ నాయకుల జన్మదినాలు, పదవీ కాల మైలురాళ్లు, వ్యక్తిగత రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజాధనాన్ని వినియోగించడంపై ప్రశ్న కీలకంగా మారుతోంది. ప్రభుత్వ ప్రకటనల వ్యయం, దాని ప్రయోజనం, చెల్లింపుల పారదర్శకతపై స్పష్టమైన వివరాలను ప్రజ లకు అందించాల్సిన బాధ్యత ప్రభు త్వాలపై ఉంది. ప్రజాసేవకు పరి మితం కావాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలు రాజ కీయ ప్రచారానికి వేదికలుగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
కేంద్రం, రాష్ట్రాల్లో ప్రకటనల వ్యయం
ప్రభుత్వ ప్రకటనలపై దేశవ్యాప్తంగా భారీగా ఖర్చు జరుగుతున్నట్టు పలు నివేదికలు పేర్కొంటు న్నాయి. 2014–15 నుంచి 2024–25 మధ్య కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ప్రకటనల కోసం రూ.5,987 కోట్లు ఖర్చు చేసినట్టు ‘న్యూస్ లాండ్రీ’ వెబ్సైట్ గతంలో నివేదిం చింది. యూపీలోని యోగి ప్రభుత్వం 2017–18 నుంచి 2024–25 మధ్య రూ.6,811.94 కోట్లు ఖర్చు చేసినట్టు మరో నివేదిక తెలిపింది. ఉత్తరాఖండ్‌లో ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రకటనల వ్యయం రూ.1,001 కోట్లకు చేరినట్టు కూడా వెల్లడైంది.



