143 జిల్లాలకుగానూ
104 జిల్లాల్లో లోటు వర్షపాతం
ప్రత్యేక అత్యవసర ప్రణాళికలతో ఎదుర్కొంటున్నాం : కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
143 జిల్లాలకుగానూ 104 జిల్లాల్లో లోటు వర్షపాతం
ప్రత్యేక అత్యవసర ప్రణాళికలతో ఎదుర్కొంటున్నాం
పంటల వైవిధ్యం దేశానికి అవసరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణాది రాష్ర్టాలపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. 143 జిల్లాలకు గానూ 104 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందనీ, 37 జిల్లాల్లో సాధారణ, కేవలం రెండు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని వివరించారు. ప్రత్యేక అత్యవసర ప్రణాళికలతో ఎల్‌నినోను ఎదుర్కొంటున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో సౌత్‌జోన్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌కు శివరాజ్‌సింగ్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. ‘ఎల్ నినో’ వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ‘ఫసల్ బీమా యోజన’ రైతులకు వరప్రసాదంగా మారుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆ పథకంలో చేరడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో, తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి వచ్చే ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి వీలుగా కేంద్రం “విత్తన బ్యాంకు”ను కూడా సిద్ధం చేసి ఉంచిందని తెలిపారు. పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి పంటలు తక్కువ వర్షపాతంలో కూడా తట్టుకోగలవని చెప్పారు. పంటల వైవిధ్యం కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు.కొత్త విత్తన చట్టం రూపకల్పన కోసం రైతులు, రైతు సంఘాల నుంచి దాదాపు 13వేల సూచనలు వచ్చాయనీ, అందరితో చర్చించిన తర్వాతే ఏకాభిప్రాయంతో కొత్త విత్తన, రసాయన, ఎరువుల చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం కట్టుబడి ఉందనీ, 2070 నాటికి ‘నెట్ జీరో’ సాధించడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని స్పష్టం చేశారు.
రసాయనాలు, ఎరువులు వాడకాన్ని తగ్గించండి
రసాయనాలు, ఎరువుల అతిగా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా సమతుల్య ఎరువులను వాడేలా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నా మన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై అన్ని రాష్ట్రాలు మొగ్గు చూపాయన్నారు. ప్రకృతి వ్యవసాయ మిషన్ లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి రబీ సదస్సు సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఢిల్లీలోని పూసా సంస్థలో జరుగుతుందనీ, దానికి అన్ని రాష్ర్టాల వ్యవసాయ మంత్రులు హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా విదేశాల్లో మన ఉత్పత్తులు జీరో శాతం సుంకంతో ఎగుమతి చేయొచ్చన్నారు.
అయితే, నాణ్యత కలిగిన ఉత్పత్తులను పండిస్తేనే మంచి గుర్తింపు వస్తుందన్నారు. సదస్సులో నేషనల్ ఆయిల్ పామ్ మిషన్, పప్పుధాన్యాల మిషన్‌పై విస్తృతంగా చర్చించామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పాదకతలో చాలా వ్యత్యాసం ఉందనీ, కేరళ వంటి రాష్ట్రంలో హెక్టారుకు 1575 కిలోల కందిపప్పు దిగుబడి వస్తుంటే హెక్టారుకు కేవలం 475 కిలోలు మాత్రమే వచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయని వివరించారు. అందుకే మంచి విత్తనాలు ఎంచుకోవాలని సూచించారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రా ఫండ్‌పైనా విస్తృతంగా చర్చించామని తెలిపారు. రైతులకు ఐడీల తయారీ ప్రక్రియ వేగంగా జరుగుతోందనీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అధిక పురోగతి ఉందని చెప్పారు. పామాయిల్ సాగులో కూడా తెలంగాణ చాలా ముందంజలో ఉందని చెప్పారు. ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ కింద గ్రామాలకు శాస్ర్తవేత్తలు వెళ్లి, రైతులతో మాట్లాడుతారనీ, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయడం వల్ల నూతన సాంకేతికత పరిశోధనల ఫలితాలు రైతులకు సులువుగా చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రానికి వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను తయారుచేస్తామన్నారు. పంటల వైవిధ్యం దేశానికి చాలా అవసరమని తెలిపారు. తెలంగాణకు రెండు లక్షల పీఎం ఆవాస్ యోజన ఇండ్లను మంజూరు చేశామన్నారు.



