Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ భూమిపై 
సమగ్ర విచారణ జరపాలి

ప్రభుత్వ భూమిపై 
సమగ్ర విచారణ జరపాలి

- Advertisement -

వెలికట్టలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందం
ప్రభుత్వ భూమి.. ప్రయివేటు వ్యక్తుల పేరిట మారడంపై అభ్యంతరం

నవతెలంగాణ-కొండపాక
సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 271 భూమిపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్‌ ‌చేశారు. ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకుల బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో వివాదస్పద భూములను పరిశీలించింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్‌రావు మామకు సంబంధించినదిగా పేర్కొంటున్న ఈ భూమిపై ఇటీవల వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. 131 సర్వే నంబర్‌కు సంబంధించిన ఎన్‌వోసీని 271 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమికి వర్తింపజేసిన‌ట్టు ఆరోపించారు. ఎన్‌వోసీకి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన పత్రాలు చూపుతున్నారని, అసలు ఎన్‌వోసీ జారీ చేసే అధికారం ఎవరికి ఉందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా జారీ చేయాల్సిన ఎన్‌ఓసీ ఆర్టీఓ జారీ చేసినట్టు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ప్రయివేట్‌ వ్యక్తి పేరున బదలాయించినట్టు తెలిపారు.

271 సర్వే నంబర్‌లోని భూమి ప్రభుత్వ భూమిగా ఉందని పేర్కొంటూ.. గతంలో స్వాతంత్య్ర సమరయోధులు లేదా లబ్దిదారులకు కేటాయింపులకు సంబంధించిన అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ భూమి ప్రయివేటు వ్యక్తుల పేరిట ఎలా నమోదైందనే విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పట్టాలు, ఎన్‌వోసీలు, రెవెన్యూ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, కొండపాక తహసీల్దార్ స్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, ప్రభుత్వ భూముల రికార్డులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరామ్ నాయక్, సురేష్ షెట్కర్, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, కొండపాక ఏఎంసీ చైర్మెన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి, స్థానిక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల కనక రాములు, పలువురు సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -